తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. వర్షాల కారణంగా సైబరాబాద్ ఏరియాలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉండడంతో.. ట్రాఫిక్ రద్దీని తగ్గించే చర్యలు చేపట్టారు. ఈ మేరకు సమావేశమైన అధికారులు ఈ సమస్యను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని.. ముఖ్యంగా సైబరాబాద్‌లోని ఐటీ కంపెనీలు, పలు ఇతర సంస్థలకు కీలక సూచనలు చేశారు. వీలైతే సదరు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి విడతల వారీగా లాగౌట్ ఇవ్వాలని కోరారు.
వర్షం కారణంగా ఏర్పడే ట్రాఫిక్ రద్దీని తగ్గించి.. అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఈ నిర్ణయంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతో పాటు ప్రమాదాలను కూడా నివారించవచ్చని పోలీసులు తెలిపారు. కాబట్టి ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు లాగౌట్‌కు సంబంధించిన వివరాలను ఈమెయిల్ చేయాలని తెలిపారు.
పోలీసులు జారీ చేసిన ప్రకటన ఇదే
Revised order stating the Work from Home (WFH) and Early logouts in staggered manner on 30.07.2026 from 2pm onwards.. pic.twitter.com/TyBkw4g5Qh
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) July 30, 2026
ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఇది తమ బాధ్యతగా తీసుకొని పోలీసులకు సహకరించాలని కోరారు. నగరవాసులకు కూడా పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అలాగే వర్షాల సమయంలో వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.