అండర్ గ్రాడ్యుయేట్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో తిరస్కరణకు గురవడంతో తాను ఐఐటీకాన్పూర్, ఐఐటీ మద్రాస్ వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసినట్లు ఓ విద్యార్థి సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించడంతో గత వారం రోజులుగా సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత తన ఉద్దేశ్యం హాని కలిగించడం కాదని, తన సామర్థ్యాలను ప్రదర్శించడమేనని చెబుతూ హ్యాక్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను నెట్టింట పోస్టు చేశాడు. ఐఐటీ-కాన్పూర్ వెబ్‌సైట్‌లో ‘Site is hacked. All I need is just a fair chance’ (సైట్ హ్యాక్ చేయబడింది. నాకు కావాల్సింది ఒక్క న్యాయమైన అవకాశం మాత్రమే) అనే సందేశాన్ని అందులో తెలిపాడు. ఈ ఘటన ఈ వారం ప్రారంభంలో వెలుగులోకి వచ్చింది. సైబర్ సెక్యూరిటీ కోర్సులో తనకు ప్రవేశం నిరాకరించడంతోనే ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-మద్రాస్ వెబ్‌సైట్ల భద్రతను పరీక్షించానని విద్యార్థి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అనంతరం ఎక్స్ (X), రెడిట్ (Reddit)లో హ్యాకింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కూడా షేర్ చేశాడు. తన ఉద్దేశం ఎలాంటి నష్టం కలిగించడం కాదని, తన సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలను నిరూపించుకోవడమేనని విద్యార్థి అందులో పేర్కొన్నాడు.
విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. ఐఐటీ-కాన్పూర్ సైబర్ సెక్యూరిటీ బ్యాచిలర్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశాడు. దరఖాస్తు రుసుము చెల్లించడంతో పాటు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేశాడు. అలాగే తాను చేసిన సైబర్ సెక్యూరిటీ పనులకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించాడు. అయితే తనను షార్ట్‌లిస్ట్ చేయలేదని, ప్రవేశ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన హ్యాకథాన్‌లో పాల్గొనే అవకాశం కూడా ఇవ్వలేదని అతను ఆరోపించాడు. అయితే సదరు విద్యార్ధికి రెండో అవకాశం ఇస్తున్నట్లు ఐఐటీ-కాన్పూర్ ప్రకటించింది. దీనిపై ఐఐటీ-కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, అందువల్ల ప్రస్తుతం ప్రవేశం కల్పించడం సాధ్యం కాదని తెలిపారు. అయితే ఆ విద్యార్థిని సంస్థకు ఆహ్వానించి, అతని సాంకేతిక నైపుణ్యాలను ప్రత్యేక పరీక్ష ద్వారా అంచనా వేస్తామని చెప్పారు. అతను తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటే వచ్చే అడ్మిషన్ సైకిల్‌లో అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. అలాగే సదరు విద్యార్థి ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-మద్రాస్ అధికారిక వెబ్‌సైట్లలోని కొన్ని విభాగాలకు అనధికారికంగా యాక్సెస్ పొందినట్లు ఆయన ధృవీకరించారు.
సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు, ఇంజినీర్లు విద్యార్థితో మాట్లాడించి, అతనికి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఐఐటీ-కాన్పూర్ నిర్ణయించింది. కంప్యూటర్ వ్యవస్థల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం చట్టవిరుద్ధమని, భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని సూచించనుంది. మొదట ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సంస్థ భావించినప్పటికీ, ముందుగా విద్యార్థి చెప్పిన విషయాలను పరిశీలించి, అతని సాంకేతిక సామర్థ్యాలను అంచనా వేయాలని నిర్ణయించినట్లు ఐఐటీ-కాన్పూర్ అధికారి ఒకరు తెలిపారు. యువ సైబర్ సెక్యూరిటీ ప్రతిభను ప్రోత్సహించడంలో ఐఐటీ-కాన్పూర్ ముందుంటుందని అధికారులు తెలిపారు. గతంలో సీబీఎస్‌ఈ ఆన్‌లైన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లో లోపాలను గుర్తించిన ఓ యువకుడికి ఐఐటీ-కాన్పూర్‌లోని C3iHubలో అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటనతో సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ ఉన్న యువతకు సరైన మార్గదర్శకత్వం, అవకాశాలు కల్పించాల్సిన అవసరం మరోసారి చర్చకు వచ్చింది.