2026 Commonwealth Games: యువతరం మాత్రమే క్రీడల్లో రాణించి పతకాలు సాధించగలదనే అపోహను పటాపంచలు చేసింది భారత పారా అథ్లెట్ షర్మిలా ధన్‌ఖడ్. క్రీడల్లో సత్తా చాటడానికి వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపించింది. తనను శారీరకంగా కుంగదీసిన పోలియో మహమ్మారిని ఎదిరించి గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. నలభై ఏళ్ల వయసులో షాట్‌పుట్ ఎఫ్57 విభాగం ఫైనల్లో ఏకంగా 9.81 మీటర్ల దూరం గుండును విసిరి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. కామన్వెల్త్ క్రీడల పారా అథ్లెటిక్స్‌లో భారత దేశం రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పసిడి కలను సాకారం చేసింది. అయితే, ఈ పతకం వెనుక ఉన్నది కేవలం క్రీడా నైపుణ్యం మాత్రమే కాదు. గుండెల్ని పిండేసే ఎన్నో కన్నీటి గాథలు ఆమె గెలుపు ప్రయాణంలో దాగి ఉన్నాయి.
హరియాణా రాష్ట్రం మహేంద్రగఢ్ జిల్లాలోని చిత్రౌలి అనే ఓ చిన్న గ్రామంలో షర్మిల జన్మించింది. అక్కడి నుంచి ఇప్పుడు గ్లాస్గో వేదికగా దేశ ప్రతిష్టను నలుదిశలా చాటే స్థాయికి ఎదగడం వెనుక మాటల్లో చెప్పలేనన్ని కష్టాలు ఉన్నాయి. షర్మిల తండ్రి ఓ పేద సన్నకారు రైతు. తల్లికి కంటిచూపు లేదు. నలుగురు సంతానంలో షర్మిల రెండో బిడ్డ. ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దానికి తోడు సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో రెండేళ్ల పసిప్రాయంలోనే ఆమె పోలియో బారిన పడింది. ఆ మహమ్మారి దెబ్బకు ఎడమకాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. ఆ శారీరక లోపంతోనే ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని పదో తరగతి వరకు చదువుకుంది. ఆ వెంటనే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసి పంపించారు. అక్కడితో ఆమె కష్టాలు తీరతాయని అనుకుంటే, అసలు నరకం అప్పుడే మొదలైంది.
పెళ్లితో షర్మిల జీవితంలో శారీరక ఇబ్బందులకు అంతులేని మానసిక క్షోభ కూడా తోడైంది. కట్టుకున్న భర్త నిత్యం మద్యం, మాదకద్రవ్యాల మత్తులో మునిగితేలేవాడు. కుటుంబ భారాన్నంతా ఆమె ఒంటరిగా మోయాల్సి వచ్చింది. అది చాలదన్నట్టు పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురాలేదని రోజూ చిత్రహింసలు పెట్టేవాడు. వరుసగా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న నెపంతో మరింత దారుణంగా కొట్టేవాడు. ఇరవై ఆరేళ్ల వయసులో ఓ రోజు ఆ కిరాతకుడు మరీ వికృతంగా ప్రవర్తించాడు. విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, దుస్తులు చించి అందరూ చూస్తుండగానే ఇరుగుపొరుగు ముందు నిలబెట్టాడు. ఇద్దరు పసిపిల్లలతో సహా ఆమెను ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. దిక్కుతోచని స్థితిలో పుట్టింటికి చేరుకున్న ఆమె, బతకడానికి కాయకష్టం చేసింది. దొరికిన ప్రతి పనీ చేస్తూ పిల్లలను సాకింది. పనిలో బిజీగా ఉండటం వల్లే తన బుర్రలోకి ఎలాంటి చెడు ఆలోచనలు రాలేదని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.
చీకటి కమ్మిన ఆమె జీవితంలో ఇరవై ఎనిమిదేళ్ల వయసులో ఓ వెలుగు రేఖ కనిపించింది. అజిత్ సింగ్ అనే వ్యక్తితో ఆమెకు రెండో వివాహం జరిగింది. ఆ పెళ్లి ఆమె పాత జీవితాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. అజిత్ సింగ్ ఆమెను తన ప్రాణంగా చూసుకోవడమే కాకుండా, ఆ ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా ప్రేమతో స్వీకరించాడు. కుటుంబాన్ని రెవాఢీకి మార్చిన అతను, షర్మిలలో అద్భుతమైన స్ఫూర్తిని రగిలించాడు. ఆమెను పారా స్పోర్ట్స్‌లో చేర్పించి నిరంతరం ప్రోత్సహించాడు. అక్కడే షాట్‌పుట్‌లో షర్మిల అసాధారణ ప్రావీణ్యం సంపాదించింది. ఏ చేతులైతే కష్టాలతో కాయలు కాశాయో, అదే చేతులతో గుండును విసిరి నేడు ప్రపంచ వేదికపై విశ్వవిజేతగా నిలిచింది. గ్లాస్గో క్రీడల్లో తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి బంగారు పతకాన్ని అందించింది.
గతంలో 2006 కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెట్ రంజిత్ కుమార్ జయశీలన్ డిస్కస్ త్రోలో రజత పతకం సాధించాడు. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌లో మన దేశానికి పతకం రావడం మళ్లీ ఇదే తొలిసారి. అన్ని అడ్డంకులను బద్దలుకొట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన షర్మిల విజయంపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఆమె పోరాట పటిమను కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
సమాజం ముఖాన ఉమ్మివేసిన చోటే పూల వర్షం కురిసేలా చేసుకున్న షర్మిల ధన్‌ఖడ్ జీవితం ప్రతి మహిళకు ఒక ఆదర్శం. శారీరక లోపం, సామాజిక కట్టుబాట్లు ఏవీ కూడా సాధించాలనే పట్టుదలను ఆపలేవని ఆమె తన విజయంతో నిరూపించింది. రాబోయే పారా ఒలింపిక్స్‌లో కూడా ఆమె ఇదే స్ఫూర్తితో మరిన్ని పతకాలు కొల్లగొట్టాలని యావత్ దేశం కోరుకుంటోంది.





