మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాతం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. సాధారణంగా బూడిద గుమ్మడికాయతో వడియాలు, పాయసం లేదా కూరలు చేస్తారు, కానీ రోట్లో దంచి చేసే ఈ బూడిద గుమ్మడికాయ రోటి పచ్చడి రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకోవడం ఖాయం.
ఈ పచ్చడి తయారీ విధానం ఎంతో సులభం, పైగా ఇందులో ఒక్క చుక్క నీరు కూడా వాడం కాబట్టి ఇది కొన్ని రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. ముందుగా లేత బూడిద గుమ్మడికాయను తీసుకుని, చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మరియు తెల్ల నువ్వులు వేసి సన్నటి మంటపై మాడకుండా దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
నువ్వులు వేయడం వల్ల పచ్చడికి మంచి రుచితో పాటు క్యాల్షియం కూడా అందుతుంది. అదే బాండీలో మరికొద్దిగా నూనె వేసి, కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ముక్కలు 75% వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసి ముక్క మెత్తబడే వరకు మగ్గించాలి.
చింతపండును ముందే వేస్తే బాండీ అడుగు అంటుతుంది కాబట్టి చివర్లో వేయడం మంచిది. ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు రోట్లో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, నువ్వుల మిశ్రమాన్ని వేసి పొడిలా దంచుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసి నలిపి, ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
రుబ్బేటప్పుడు బాగా ఎనపడం వల్ల పచ్చడికి మంచి జిగురు వచ్చి రుచి పెరుగుతుంది. చివరిగా బాండీలో నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి కమ్మటి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. కావలసిన వారు చివర్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవచ్చు. కమ్మటి రుచితో ఉండే ఈ పచ్చడి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ముందుంటుంది.




