Headlines

అప్పు చేసి అథ్లెట్‌గా మార్చిన తండ్రి.. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం..!

అప్పు చేసి అథ్లెట్‌గా మార్చిన తండ్రి.. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం..!


పేదరికం ఆమె పట్టుదలను ఆపలేకపోయింది. కూతురిని అథ్లెట్‌గా మార్చేందుకు ఓ తండ్రి చేసిన అప్పులు, రాత్రింబవళ్లు పడిన కష్టం ఎట్టకేలకు అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో అనూహ్య ప్రదర్శనతో ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం కొల్లగొట్టి యావత్ దేశం గర్వపడేలా చేసింది.

కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన..

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ల హవా అనూహ్యంగా కొనసాగుతోంది. ప్రపంచ స్థాయి క్రీడాకారులు తలపడుతున్న ఈ మెగా టోర్నీలో తాజాగా 53 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో జ్ఞానేశ్వరి యాదవ్ తన అద్భుతమైన బలప్రదర్శనతో అందరినీ అబ్బురపరిచింది. తన సుదీర్ఘ కెరీర్‌లో తొలిసారిగా సీనియర్ కామన్వెల్త్ క్రీడల బరిలో దిగిన ఆమె ఏమాత్రం బెదరకుండా ఉద్దండులైన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది. అత్యంత ఏకాగ్రతతో బరిలోకి దిగి స్నాచ్ విభాగంలో 88 కిలోల బరువును అలవోకగా ఎత్తింది. ఆ వెంటనే క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 111 కిలోలు ఎత్తి తన మార్క్ చూపించింది. రెండు విభాగాల్లో కలిపి మొత్తం మీద 199 కిలోల బరువును సునాయాసంగా లేపింది. ఈ అసాధారణమైన ప్రదర్శనతో ఆమె నేరుగా రజత పతకాన్ని తన సొంతం చేసుకుని భారత పతకాల పట్టికకు మరింత వన్నె తెచ్చింది.

కూతురి కోసం తండ్రి చేసిన త్యాగం..

జ్ఞానేశ్వరి యాదవ్ ఈ అద్భుత స్థాయికి చేరుకోవడం వెనుక కదిలించే కన్నీటి కథ ఒకటి దాగి ఉంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని భోండియా అనే ఒక మారుమూల గ్రామం ఆమె సొంతూరు. ఎంతో కష్టపడి పైకొచ్చిన ఆమె ప్రస్తుతం అక్కడి పోలీస్ శాఖలో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె తండ్రి దీపక్ యాదవ్ స్వతహాగా మంచి బాడీబిల్డర్. కానీ కుటుంబ పోషణ భారం పెరగడంతో తన కలను అర్థాంతరంగా త్యాగం చేసి ఒక సాధారణ ఎలక్ట్రీషియన్‌గా మారాల్సి వచ్చింది. తాను కోల్పోయిన అద్భుతమైన క్రీడా జీవితాన్ని తన కూతురిలో చూసుకున్న ఆ తండ్రి మనసు ఉప్పొంగింది. ఆమెను గొప్ప అథ్లెట్‌గా తీర్చిదిద్దేందుకు ఏకంగా రోజుకు ఇరవై గంటల పాటు అలుపెరగకుండా శ్రమించాడు. ఒక దశలో కరోనా మహమ్మారి రాకతో దేశమంతా స్తంభించిపోయిన కష్టకాలంలో జ్ఞానేశ్వరి శిక్షణకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆమెకు కనీస పోషకాహారం, డైట్ అందించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేని అత్యంత దీన పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా ఆ తండ్రి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేసి మరీ ఖరీదైన సప్లిమెంట్స్ కొనిచ్చాడు. ఆ త్యాగమే నేడు ఆమెను కామన్వెల్త్ ఛాంపియన్‌గా నిలబెట్టింది.

జాతరలో మొదలైన స్ఫూర్తి..

జ్ఞానేశ్వరి యాదవ్ వెయిట్‌లిఫ్టర్‌గా మారడం వెనుక ఒక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన సంఘటన ఉంది. ఆమె కేవలం ఏడో తరగతి చదువుతున్న వయసులో కుటుంబంతో కలిసి ఒక స్థానిక జాతరకు వెళ్లింది. అక్కడ కొంతమంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా వెయిట్‌లిఫ్టింగ్ చేస్తూ కనిపించారు. ఆ అరుదైన దృశ్యం ఆమె పసి మనసులో బలంగా నాటుకుపోయింది. తాను కూడా అలాగే బరువులెత్తాలని నిర్ణయించుకుంది. మొదట పవర్‌లిఫ్టింగ్‌తో క్రీడా ప్రయాణం మొదలుపెట్టిన ఈ చాంపియన్.. కేవలం ఏడాది కాలంలోనే అద్భుతాలు సృష్టించింది. తన 37 కిలోల శరీర బరువుతో ఏకంగా 65 కిలోల స్క్వాడ్, 95 కిలోల డెడ్‌లిఫ్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సబ్-జూనియర్ జాతీయ స్థాయిలో పవర్‌లిఫ్టింగ్‌లో ఏకంగా స్వర్ణం సాధించడంతో.. ఆమె తండ్రి పక్కా ప్రణాళికతో వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లించాడు. ప్రముఖ కోచ్ అజయ్ లోహార్ విశ్వకర్మ వద్ద కఠోరమైన శిక్షణ ప్రారంభించిన తర్వాత జ్ఞానేశ్వరి తన జీవితంలో ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.

వరుస పతకాలతో అప్రతిహత జైత్రయాత్ర..

జ్ఞానేశ్వరి యాదవ్ విజయాల పరంపర కేవలం ఈ కామన్వెల్త్ గేమ్స్‌తోనే మొదలవ్వలేదు. గతంలో ఎన్నో అద్భుతాలు నమోదు చేసింది. 2022 సంవత్సరంలో గ్రీస్ వేదికగా జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో రజతం నెగ్గి అంతర్జాతీయ క్రీడా వేదికపై తన సత్తా చాటింది. ఆ తర్వాత అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ 2023 కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్, సీనియర్ రెండు విభాగాల్లో ఏకంగా స్వర్ణాలు గెలుచుకుంది. అంతేకాకుండా అదే టోర్నీలో బెస్ట్ జూనియర్ లిఫ్టర్ అవార్డును సైతం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే 2025 జాతీయ క్రీడల్లో పసిడి పతకం సాధించిన ఈ స్టార్ లిఫ్టర్.. 2026 ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనూ రజతంతో మెరిసింది. అంచలంచలుగా ఎదుగుతూ తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో మరో రజతం ఖాతాలో వేసుకుని తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *