మన దేశంలో పచ్చిమిరపకాయలు లేని ఇల్లు ఉండదు. సాంబార్, చట్నీ, పాల్య, ఘుమఘుమలాడే బిర్యానీ.. ఇలా ఏది వండినా కారం, ఘాటు కోసం పచ్చిమిరపకాయలు ఉండాల్సిందే. మన దేశంలో వీటికి కొరత లేదు, ధర కూడా చాలా తక్కువ. మార్కెట్‌కు వెళ్తే కేవలం 20 రూపాయలకే వారానికి సరిపడా మిరపకాయలు దొరుకుతాయి. ఒక్కోసారి కూరగాయలు కొంటే ఉచితంగా కూడా వేస్తుంటారు. కానీ అవే పచ్చిమిరపకాయలను అమెరికాలో కొనాలంటే మాత్రం జేబు ఖాళీ అవ్వాల్సిందే. తాజాగా ఓ ఎన్నారై మహిళ అమెరికాలోని కూరగాయల ధరలను చూపిస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
12 మిరపకాయలకు రూ. 400.. కిలో ధర వింటే మైండ్ బ్లాక్..
వైరల్ అవుతున్న ఆ వీడియోలో సదరు మహిళ అమెరికాలోని ఒక సూపర్ మార్కెట్లో 114 గ్రాముల బరువున్న పచ్చిమిరపకాయల ప్యాకెట్‌ను కెమెరాకు చూపిస్తుంది. ఆ చిన్న ప్యాకెట్లో లెక్కబెడితే కేవలం 12 నుంచి 13 మిరపకాయలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ ప్యాకెట్ ధరను భారతీయ రూపాయిల్లోకి మార్చితే అక్షరాలా రూ. 400 అవుతుంది. ఈ లెక్కన చూస్తే అమెరికాలో ఒక కిలో పచ్చిమిరపకాయల ధర దాదాపు రూ.3,500 వరకు ఉంటుంది. మన భారతదేశంలో రూ.400 ఖర్చు చేస్తే వారం మొత్తానికి సరిపడా కూరగాయల సంచి నిండిపోతుంది. కానీ అక్కడ గుప్పెడు మిరపకాయల కోసం ఇంత భారీ మొత్తంలో వెచ్చించాల్సి రావడం చూసి నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో పచ్చిమిరపకాయలు అంత ఖరీదు ఎందుకు?
అమెరికాలో మన ఇండియన్ కూరగాయల ధరలు అంత ఆకాశాన్నంటడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి.
దిగుమతి ఖర్చులు: భారతదేశంలో లభించే స్థానిక రకం పచ్చిమిరపకాయలు అమెరికాలో అన్ని ప్రాంతాల్లో పండవు. వీటిని ప్రధానంగా మెక్సికో లేదా ఆసియా దేశాల నుండి దిగుమతి చేసుకుంటారు.
ప్యాకేజింగ్ – రవాణా: విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి అయ్యే రవాణా ఖర్చులు, కోల్డ్ స్టోరేజ్ నిర్వహణ, ప్యాకేజింగ్, అక్కడి కార్మిక వ్యయం చాలా ఎక్కువగా ఉండటంతో అంతిమంగా ధర భారీగా పెరుగుతుంది.
ఆదాయం – కొనుగోలు శక్తి: అమెరికాలోని జీవన వ్యయం, ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి మన దేశంతో పోలిస్తే చాలా ఎక్కువ. డాలర్లలో ఉన్న ధరను నేరుగా రూపాయల్లోకి మార్చి చూసినప్పుడు మనకు అది అత్యంత ఖరీదైనదిగా అనిపిస్తుంది. కాగా కారణాలు ఏవైనా సరే, విదేశాలకు వెళ్లిన తర్వాతే మన దేశంలో దొరికే స్థానిక మార్కెట్లు, తక్కువ ధరల కూరగాయల అసలు విలువ ఏంటో అర్థమవుతుందని ఎన్నారైలు కామెంట్లు చేస్తున్నారు.