భూమి, బంగారం.. ఈ రెండింటిపై పెట్టుబడులు పెడితే లాభాలే కానీ నష్టాలు ఉండవు.. ఆర్థిక నిపుణుల నోటి నుంచి తరచూ వచ్చే మాట ఇది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరులు అయిన వారు చాలా మందే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోనూ చాలా మంది రియల్ ఎస్టేట్ తో భారీగా ఆస్తులు పోగేశారు. మన తెలుగు సినీ దిగ్గజం శోభన్‌బాబు కూడా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టి భారీగా ఆస్తులు పోగేశారు. అలాగే ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ కూడా భూమిపై ఇన్వెస్ట్ మెంట్ చేసి భారీగా ఆస్తులు కూడా బెట్టారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్టార్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. కొన్నేళ్ల క్రితం అతను కేవలం రూ. 4.25 లక్షలకు కొనుగోలు చేసిన ఒక బంగ్లా, ఇప్పుడు ఏకంగా రూ. 450 కోట్లు పలుకుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆ హీరో స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. దీంతో మరోసారి రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై చర్చ మొదలైంది. ఇంతకీ ఆ లక్కీ హీరో ఎవరనుకుంటున్నారా? ఒకప్పుటి బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన జితేంద్ర 1970లలో ముంబైలోని పాలీ హిల్‌లో సుమారు 3,450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ బంగ్లాను రూ.4.25 లక్షలకు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ ధర కూడా చిన్న మొత్తమేమీ కాదు. అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారీగా డబ్బులు చెల్లించి ఆ ఆస్తిని సొంతం చేసుకున్నారు జితేంద్ర. అయితే ఈ ఇల్లు కొన్న తర్వాత జితేంద్ర జీవితంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో జితేంద్ర స్నేహితులు ఈ బంగ్లాను అమ్మేయాలని సలహా ఇచ్చారట. కానీ జితేంద్ర మాత్రం ఒప్పుకోలేదట.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, భూమి విలువ ఎప్పటికైనా మారుతుందన్న నమ్మకంతో ఆ బంగ్లాను అలాగే ఉంచారు జితేంద్ర. ఆ నిర్ణయమే ఇప్పుడు ఆయనకు భారీ ఆదాయాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ప్రదేశంలో ఉన్న ఆ ప్రాపర్టీ మార్కెట్ విలువ దాదాపు రూ.450 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని స్వయంగా జితేంద్రనే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముంబైలోని పాలీ హిల్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ లొకేషన్లలో ఒకటిగా మారింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, వ్యాపార వేత్తలు ఈ ప్రాంతలోనే ఉంటున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా ఇక్కడి భూముల ధరలు ఆకాశనంటుతున్నాయి. అలా జితేంద్ర ఉన్న భవనం విలువ ఇప్పుడు రూ. 450 కోట్లకు పైమాటేనని ఆయన కుమారుడు హీరో తుషార్ కపూర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సినిమా సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది.

Actor Jitendra
ముంబైలో జితేంద్ర ఇల్లు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి