నీట్ 2026 పరీక్షకు సంబంధించిన వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ప్రముఖుల మద్దతు క్రమంగా పెరుగుతోంది. బాలీవుడ్ నటీనటుల తర్వాత తాజాగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తూ, విద్యా వ్యవస్థలో అర్థవంతమైన సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన సానియా మీర్జా, విద్యార్థులే దేశ భవిష్యత్తని పేర్కొన్నారు. నీట్ వంటి అత్యంత పోటీ పరీక్షల కోసం సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమయ్యే విద్యార్థులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనిశ్చితి బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.
విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు సానుకూలంగా వినాలని, వారి సమస్యలకు న్యాయమైన పరిష్కారం చూపాలని సానియా కోరారు. అలాగే విద్యార్థుల్లో విద్యా వ్యవస్థపై తిరిగి విశ్వాసం పెంచేలా పారదర్శకమైన, సమర్థవంతమైన సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘మన సమాజంలో హింసకు ఎలాంటి స్థానం లేదు. యువత భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కలిసి సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనాలి’ అని సానియా మీర్జా తన సందేశంలో పేర్కొన్నారు.
ఇటీవల విద్యార్థుల ఉద్యమానికి సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల మద్దతు పెరుగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో నటులు హుమా ఖురేషి, సాకిబ్ సలీమ్, రచిత్ సింగ్ పాల్గొని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. అలాగే నటుడు ఇమ్రాన్ ఖాన్ ముంబైలో విద్యార్థులతో కలిసి కవాతులో పాల్గొన్నారు. అదే సమయంలో సల్మాన్ ఖాన్, అలియా భట్, ఇబ్రహీం అలీ ఖాన్, రితీష్ దేశ్ముఖ్, జెనీలియా దేశ్ముఖ్, సోనాక్షి సిన్హా, ఫాతిమా సనా షేక్, భూమి పెడ్నేకర్, దిల్జిత్ దోసాంజ్, విశాల్ దద్లానీ, షబానా ఆజ్మీ, ప్రకాశ్ రాజ్, నసీరుద్దీన్ షా తదితర ప్రముఖులు కూడా విద్యార్థుల ఆందోళనలపై స్పందిస్తూ, విద్యా వ్యవస్థలో పారదర్శకత, న్యాయం, సంస్కరణలు అవసరమని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి