Headlines

సార్.. మీరు పెద్ద నటుడు అవుతారు..? నాకు బట్టలు పెడతారా అని అడిగిన లైట్ బాయ్.. ఆయన ఎదిగాక

సార్.. మీరు పెద్ద నటుడు అవుతారు..? నాకు బట్టలు పెడతారా అని అడిగిన లైట్ బాయ్.. ఆయన ఎదిగాక


తెలుగు సినీ చరిత్రలో కామెడీకి సరికొత్త నిర్వచనం చెప్పిన మహానటుడు కమెడియన్ రాజబాబు. తన విలక్షణ నటనతో, సహజమైన హాస్యంతో ప్రేక్షకులను కట్టిపడేసిన రాజబాబు, ఎప్పటికీ చెరగని ముద్ర వేశారు. తెరపై నవ్వుల పువ్వులు పూయించిన ఆయన నిజజీవితం, కెరీర్ ఎన్నో ఆసక్తికర సంఘటనలతో నిండి ఉన్నాయి. ఒక సందర్భంలో, ఆర్టిస్టుల సెలక్షన్ జరుగుతున్నప్పుడు, ఒక సినిమా నిర్మాత రాజబాబును పిలిచి, రామారావు గారు ఎన్ని గెటప్పులు వేస్తారో మీరు అన్ని వేస్తారు అని చెప్పారు. తన రెమ్యూనరేషన్ ఎంత అని అడిగిన రాజబాబుకు, మీరు ఎప్పుడూ తీసుకునేది ఇరవై వేలే కదా అని నిర్మాత అన్నారు. అయితే రామారావు గారికి ఎంత అని అడగగా, ముప్పై ఐదు వేలు అని నిర్మాత బదులిచ్చారు. ఆయనతో సమానంగా చేస్తున్నప్పుడు నాకూ అంతే ఇవ్వండి అని రాజబాబు ధైర్యంగా అడిగారు. నిర్మాత ఆశ్చర్యపోయినా, మారు మాట్లాడకుండా ముప్పై ఐదు వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇది ఆ రోజుల్లో రాజబాబుకు ఉన్న డిమాండ్, ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆయన ఏది చేస్తే అదే కామెడీ. “అయ్యబాబోయ్” అని మెలికలు తిరిగిపోతూ ఆయన నటిస్తుంటే థియేటర్లో జనం గొల్లుమనేవారు. రాజబాబు అంటే ఆ రోజుల్లో అంత క్రేజ్. పీల పర్సనాలిటీ, రింగు రింగుల జుట్టు, గోలీ ముక్కు వంటి ఆకారం ఉన్న రాజబాబు రోజుకు మూడు సినిమాలు చేస్తూ, సుమారు పదమూడేళ్ళ పాటు తెలుగు చిత్ర పరిశ్రమని ఏలారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలు ఎవరైనా సరే, వారి సినిమాలలో కమెడియన్‌గా మాత్రం రాజబాబు ఉండాల్సిందే. ఆయన కోసం హీరోలు షూటింగ్ స్పాట్‌లో వెయిట్ చేసిన రోజులు ఎన్నో. రాజబాబు, రమాప్రభలది సూపర్ హిట్ కాంబినేషన్. “నిన్ను మేకప్‌లో కాకుండా మాములుగా ఎప్పుడు చూస్తానే” అనేవారు రాజబాబు రమాప్రభతో సరదాగా. ఆయన పోయినప్పుడు, రమాప్రభ “రాజబాబు చనిపోయి నన్ను చంపేశాడు” అని బాధతో అన్నారు.

కమెడియన్‌గానే కాకుండా, తాతా మనవడు, తిరుపతి, ఎవరికివారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు వంటి చిత్రాల్లో హీరోగా కూడా రాజబాబు నటించారు. “పిచ్చోడి పెళ్లి” చిత్రాన్ని మొదట చలం, విజయనిర్మల కాంబినేషన్లో తీద్దామని ప్లాన్ చేసినా, చలం నటించిన దేవుడమ్మ చిత్రం ఫ్లాప్ కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. చివరి క్షణంలో నిర్మాత ప్రకాష్ రెడ్డికి రాజబాబు గుర్తుకొచ్చారు. రాత్రి రెండు గంటలకు వెళ్లి రాజబాబు తలుపు తట్టారు. రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్న రాజబాబు అప్పుడు, ఇరవై రోజులు ఇస్తే సినిమా చేసుకుంటానని అర్ధించారు ప్రకాష్ రెడ్డి. ఆలోచించి చెప్తాను అని చెప్పి, ఆ మర్నాడు పద్దెనిమిది రోజులు ఇవ్వగలనని రాజబాబు చెప్పారు. విజయనిర్మల కథానాయకగా నటించిన ఈ చిత్రానికి నృత్య దర్శకుడు కేఎస్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి లక్ష రూపాయల పారితోషకంగా తీసుకున్నారు రాజబాబు. ఇదే ఆయన హైయెస్ట్ రెమ్యూనరేషన్. దేవర్ ఫిల్మ్స్ సంస్థ హిందీలో తీసిన రాణి ఔర్ లాల్ పరీ చిత్రంలో రాజబాబు ఓ పాట చేశారు. పారితోషకం ఎంత అని నిర్మాతను అడగకుండా, ఐదు వేలు అనుకున్నారు. కానీ నిర్మాత నలభై వేలు ఇచ్చారు. అందులో ఐదు వేలు మాత్రమే తన తీసుకొని మిగిలిన డబ్బుని అక్కడికక్కడే లైట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్టులు, కాస్ట్యూమర్స్, మేకప్ వారికి పంచేశారు. దట్ ఈజ్ రాజబాబు.

హాస్య నటుడిగా పేరు తెచ్చుకుంటున్న రోజుల్లో, వాహిని స్టూడియోలో ఒక లైట్ బాయ్ “సార్ చాలా బాగా చేశారు, మీరు పైకి వస్తారు, అప్పుడు నాకు బట్టలు పెట్టాలి” అన్నాడు. ఆ లైట్ బాయ్ అన్న మాటలు మర్చిపోలేక, ఎవరి రుణం ఉంచుకోకూడదు అనుకున్నారు. ఆ లైట్ బాయ్ ఎవరో గుర్తులేక, ప్రతి ఏడాది మద్రాసులోని అన్ని స్టూడియోలకు వెళ్లి ప్రతి లైట్ బాయ్‌కి బట్టలతో పాటు బిర్యానీ ప్యాకెట్ కూడా ఇచ్చేవారు రాజబాబు. ప్రేక్షకుల్ని తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వించిన రాజబాబు, నిజజీవితంలో తాత్విక ఆలోచనలు కలిగి ఉండేవారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున పాతతరం నటీనటులను సత్కరించేవారు. ఎన్నో సంస్థలకు విరాళాలు ఇచ్చారు. కోరుకొండలో జూనియర్ కాలేజ్ కట్టించారు. మహాకవి శ్రీశ్రీ మరదలు లక్ష్మి అమ్మలును వివాహం చేసుకున్న రాజబాబుకు నాగేంద్రబాబు, మహేష్ బాబు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారు అమెరికాలో స్థిరపడ్డారు.

రాజబాబు మొత్తం 514 చిత్రాల్లో నటించారు. వరుసగా ఏడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందిన తొలి హాస్యనటుడు ఆయనే. మూడు సార్లు నంది అవార్డు కూడా పొందారు. ఆయనకు గొంతు క్యాన్సర్ ఉండేది, దానికి రెండుసార్లు ఆపరేషన్ చేయించుకున్నారు. మరణించడానికి రెండు రోజుల ముందే రెండోసారి ఆపరేషన్ జరిగింది. రాజబాబుకు ఘంటసాల పాటలంటే అమితమైన ఇష్టం. మహాశివరాత్రి రోజు, ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి 11న రోజంతా ఘంటసాల పాటలు వింటూ గడిపారు. అదే రోజు రాత్రి గొంతులో ఇబ్బంది వచ్చి హైదరాబాద్ మదర్ థెరిస్సా ఆస్పత్రిలో చేరారు. 1983 ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మరణించే సమయానికి ఆయన నటించిన తొమ్మిది చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి, ఒక తెలుగు చిత్రం, ఒక హిందీ చిత్రం నిర్మాణంలో ఉన్నాయి. అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేక శైలి రాజబాబుది. తెలుగు సినీ చరిత్రలో ఆయన పేరు, ఆయన నవ్వులు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.

(ఈ సమాచారం వెటరన్ ఫిల్మ్ జర్నలిస్టుల నుంచి సేకరించాం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *