Headlines

IND vs ZIM: మ్యాచ్ లైవ్ జియో, స్టార్‌స్పోర్ట్స్, సోని.. ఎందులోనూ రాదు! మరి లైవ్ ఎక్కడ చూడాలో తెలుసా?

IND vs ZIM: మ్యాచ్ లైవ్ జియో, స్టార్‌స్పోర్ట్స్, సోని.. ఎందులోనూ రాదు! మరి లైవ్ ఎక్కడ చూడాలో తెలుసా?


ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస పరాజయాలతో నిరాశ చెందిన భారత జట్టు ఇప్పుడు జింబాబ్వే పర్యటనతో కొత్త ఆరంభానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా హరారే చేరుకుంది. ఈ సిరీస్ జూలై 23 నుంచి ప్రారంభం కానుండగా, మూడు మ్యాచ్‌లు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. వరుస విజయాలతో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పొందాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే భారత జట్టు మరో అంతర్జాతీయ సిరీస్ ఆడనుండటం విశేషం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యువ జట్టు ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసి, గత పర్యటనలో ఎదురైన నిరాశను మర్చిపోవాలని భావిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు పలువురు ఆటగాళ్లు నేరుగా హరారే చేరుకోగా, మిగతా సభ్యులు తాత్కాలిక ప్రధాన కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో భారత్ నుంచి జింబాబ్వేకు వెళ్లారు.

మూడు టీ20ల షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. తొలి టీ20 జూలై 23న సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ జూలై 25న, మూడో మ్యాచ్ జూలై 26న అదే సమయానికి హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌కు భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ చోటు దక్కించుకున్నారు. యువ ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో తమ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం లభించనుంది.

లైవ్ ఎక్కడ చూడాలి..?

అభిమానులకు మాత్రం ఈ సిరీస్ విషయంలో ఒక నిరాశ కలిగించే విషయం ఉంది. భారత్-జింబాబ్వే టీ20 సిరీస్‌కు టెలివిజన్ ప్రసారం ఉండదు. స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లలో మ్యాచ్‌లు ప్రసారం కావు. అలాగే జియోహాట్‌స్టార్, సోనీ లివ్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉండదు. ఈ మూడు మ్యాచ్‌లను అభిమానులు ఫ్యాన్‌కోడ్ (FanCode) ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించాల్సి ఉంటుంది. అందులో చూడాలంటే రూ.35 లతో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *