కాలువలు చెత్తతో నిండిపోవడం వల్ల వర్షపు నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రోడ్లు, కాలనీలు జలమయం అవుతున్నాయి. నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా అధికమవుతోంది. అందుకే కాలువలను చెత్తకుండీలుగా కాకుండా నీటి ప్రవాహ మార్గాలుగా కాపాడాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా క్యాచ్ ది రైన్ కార్యక్రమంపై కూడా విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో, అపార్ట్‌మెంట్‌లో, వాణిజ్య సముదాయంలో, ప్రభుత్వ కార్యాలయంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకేలా చేయాలని సూచించారు.