
అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గుడిలో నేడు విడుదల చేసిన తల్లికి వందనం పథకంలో ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు ఎకౌంట్లో పడ్డాయి. చంద్రబాబు చెప్పినట్టుగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నెరవేర్చినందుకుగాను ఆ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. గోడి గ్రామానికి చెందిన చిరంజీవి రాజేశ్వరి దంపతులకు నలుగురు పిల్లలు ఉండగా నలుగురు పిల్లలకు గాను 15 వేలు చొప్పున తల్లికి వందనం ఎకౌంట్లో పడడంతో ఆనందం వ్యక్తం చేశారు.
గోడి సచివాలయం వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబు రాజు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని.. గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చేవారని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికి ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక, తల్లికి వందనం పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం. ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం పాఠశాల విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా పిల్లల విద్యను ప్రోత్సహించడం. ప్రతి అర్హ విద్యార్థికి ఏటా ₹15,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తం నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలో (DBT ద్వారా) జమ చేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్, అర్హత ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అర్హులు (ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడి).విద్యార్థుల హాజరు, ఆధార్, బ్యాంకు ఖాతా, కుటుంబ వివరాలు వంటి అర్హత ప్రమాణాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
పథకం లక్ష్యాలు: పిల్లల చదువును కొనసాగించేలా ప్రోత్సహించడం. పాఠశాల మానివేత (డ్రాప్‌ఔట్)లను తగ్గించడం. పేద, మధ్యతరగతి కుటుంబాలపై విద్యా ఖర్చుల భారం తగ్గించడం.
తల్లుల చేతికి నేరుగా ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుటుంబంలో విద్యకు ప్రాధాన్యత పెంచడం.