నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెంలో ఐదు మేక పిల్లల పంపకంలో వచ్చిన వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. నెల్లూరు జిల్లా కావలి మండలం, సర్వాయపాలెం పంచాయతీ పరిధిలోని తాగేటివారిపాలేనికి చెందిన చాట్ల వాసు (26) మేకల కాపరిగా జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి తన మేకను సంరక్షణ కోసం వాసుకు అప్పగించాడు. ఇటీవల ఆ మేక ఒకేసారి ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.
మేకను ఇన్ని రోజులు ఎంతో జాగ్రత్తగా మేపి కాపాడినందుకు గాను, ప్రతిఫలంగా తనకు రెండు మేక పిల్లలను ఇవ్వాలని వాసు కోరాడు. అయితే, మేకలను కాసేందుకు ప్రతి నెలా కూలీ ఇస్తున్నానని, అదనంగా మేక పిల్లలను ఇవ్వడం కుదరదని జనార్దన్ తెగేసి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు జనార్దన్ ఈ విషయాన్ని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మందా మధు దృష్టికి తీసుకెళ్లాడు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరుగుతుండగా, మేకల కాపరి వాసుకు, మాజీ సర్పంచ్ మధుకు మధ్య మాటామాటా పెరిగింది. వాసు ఎదురు తిరిగి మాట్లాడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మధు, అతడిపై కక్ష పెంచుకుని ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నాడు.
పథకంలో భాగంగా జూలౌ 10వ తేదీన వాసును అడవిరాజుపాలెంలోని ఒక మద్యం దుకాణానికి మధు తీసుకెళ్లాడు. అక్కడ వాసుకు మద్యం తాగించిన తర్వాత, ముందుగానే సిద్ధంగా ఉన్న తన ముగ్గురు అనుచరులతో కలిసి వాసుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన వాసు అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. రక్తపుమడుగులో పడి ఉన్న వాసును గమనించిన కుటుంబ సభ్యులు మొదట మద్యం మత్తులో కిందపడి గాయపడ్డాడని భావించి ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో స్పృహలోకి వచ్చిన వాసు, మాజీ సర్పంచ్ మధు, అతని అనుచరులు తనపై చేసిన దాడి గురించి కుటుంబ సభ్యులకు చెప్పాడు. కొద్దిసేపటికే వాసు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.
ఇవి కూడా చదవండి
బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రధాన నిందితుడు మందా మధుతో పాటు దాడిలో పాల్గొన్న పందల రవిచంద్రను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కేవలం మేక పిల్లల కోసం జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..