Headlines

Andhra: సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేశాడు.. ఇప్పుడు 26 ఆవులతో అద్భుతం చేస్తున్నాడు..

Andhra: సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేశాడు.. ఇప్పుడు 26 ఆవులతో అద్భుతం చేస్తున్నాడు..


Andhra: సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేశాడు.. ఇప్పుడు 26 ఆవులతో అద్భుతం చేస్తున్నాడు..

ప్రకృతి ఇచ్చిన ప్రతి దానికి ఒక సంబంధం ఉంటుంది. మట్టికి పంటతో, పంటకు పశువులతో, పశువులకు రైతుతో. ఈ సహజ బంధాన్ని తిరిగి జీవంతో నింపుతున్నాడు అనంతపురం జిల్లా అక్కంపల్లి గ్రామానికి చెందిన యువ రైతు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించి, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేసినా, ఆయన మనసు మాత్రం మట్టి వైపు లాగింది. ఉద్యోగ జీవితాన్ని త్యజించి, ప్రకృతి వ్యవసాయాన్ని తన జీవన మార్గంగా ఎంచుకున్న ఆయన విజయగాథ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ఎంసీఏ పూర్తి చేసి, కొంతకాలం పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో పనిచేశారు. మంచి జీతం, నగర జీవితం వంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఆయన మనసు పల్లె నేల వైపే మళ్లింది. చివరకు ఉద్యోగాన్ని వదిలి సొంత ఊరికి వచ్చి వ్యవసాయాన్ని నమ్మారు. సాధారణ వ్యవసాయం కాకుండా, ప్రకృతితో కలిసి సాగే జీవన విధానమైన ప్రకృతి వ్యవసాయాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయానికి పునాది పశుసంపదే అని బలంగా విశ్వసించిన సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి దేశీ ఆవుల పెంపకాన్ని ప్రారంభించారు. మొదట్లో కేవలం రెండు, మూడు ఆవులతో మొదలైన ఈ ప్రయాణం, ఆయన కృషి, నిబద్ధతతో ఇప్పుడు 26 ఆవుల వరకు విస్తరించింది.

ఈ ఆవుల నుంచి లభించే పేడ, మూత్రం రసాయన ఎరువుల స్థానంలో సహజ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి. వీటితో జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజ ఎరువులను తయారుచేసి, నేల సారాన్ని పెంచుతూ పంటలకు బలాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా, పొలాల్లో వచ్చే పంట అవశేషాలు వృధా కాకుండా పశువులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఇలా పశువులు, పంటలు, నేల ఒకదానికొకటి పరస్పరం ఆధారపడే ఒక సహజ చక్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి విజయవంతంగా అమలు చేస్తున్నారు. వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదని, ప్రకృతిని కాపాడుతూ జీవన విధానాన్ని నిర్మించుకోవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. పశువుల పోషణకు ఏడాదికి సుమారు ఏడు లక్షల వరకు ఖర్చు అవుతుందని సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి తెలిపారు. వరి గడ్డి, పొట్టు, సప్ప వంటి వాటిని బయట నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఆయన తన పొలంలో పచ్చి గడ్డిని సాగు చేస్తూ, పశువుల దాణా అవసరాలను తీరుస్తున్నారు. ఇదంతా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ, బయటి లేబర్‌ను పెట్టుకోకుండా, తమ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రేమతో, ఆసక్తితో ఈ ఆవులను పోషిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ పని తమకు ఆధ్యాత్మికంగా, మానసికంగా ప్రశాంతతను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. పశువుల దాణా కోసం అరికోరలు వంటి వాటిని బయట విక్రయించకుండా, తామే నిల్వ ఉంచుకుని, అవసరమైనప్పుడు ఆడించి దాణాగా వాడుతున్నారు. మొక్కజొన్నలు, కందులు వంటి ధాన్యాలను బయట నుంచి కొనుగోలు చేసి లేదా సొంతంగా పండించి, వాటిని కలిపి ఆవులకు బలవర్ధకమైన దాణాను అందిస్తున్నారు.

ఇది వ్యాపార దృష్టితో కాకుండా, ఆరోగ్యకరమైన దేశీ ఆవు పాలు తాగితే తమకు, పిల్లలకు మంచి ఆరోగ్యం లభిస్తుందన్న నమ్మకంతో చేస్తున్నారు. ఆవు పేడ, మూత్రాన్ని పంచగవ్యం, జీవామృతం, పీడకలు తయారీకి వాడుతూనే, రెండు బయోగ్యాస్ ప్లాంట్లను కూడా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఇంటి అవసరాలకు సిలిండర్ గ్యాస్ అవసరం లేకుండా బయోగ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదంతా పర్యావరణ హితకరమైన, స్వయం సమృద్ధిని సాధించే జీవన విధానానికి నిదర్శనం. ప్రస్తుతం సైలేజ్ బేల్స్ కు ప్రభుత్వం సబ్సిడీని నిలిపివేసిందని, వాటిని తిరిగి అందజేస్తే పాడి రైతులకు మేలు జరుగుతుందని సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రకృతిని నమ్మితే నేల తిరిగి జీవిస్తుంది, పశువులను ఆదరిస్తే వ్యవసాయం నిలబడుతుంది అన్న సందేశాన్ని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు. యువతరం రైతులకు, భవిష్యత్ వ్యవసాయానికి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి చూపుతున్న దారి ఒక స్పష్టమైన మార్గదర్శకంగా నిలుస్తోంది.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *