Headlines

Thyroid Health: పురుషుల కంటే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు 8 రెట్లు ఎక్కువ! ఎందుకో తెలుసా?

Thyroid Health: పురుషుల కంటే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు 8 రెట్లు ఎక్కువ! ఎందుకో తెలుసా?


ఆధునిక జీవనశైలి, శారీరక ఒత్తిడి , మారిన ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న సమస్య థైరాయిడ్. అయితే ఈ వ్యాధి పురుషులతో పోలిస్తే మహిళల్లోనే విపరీతంగా కనిపోస్తోంది. చాలా మంది మహిళలు దీని ప్రారంభ సంకేతాలను కేవలం సాధారణ అలసట లేదా బరువు పెరగడం అని భావించి తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ థైరాయిడ్ మన శరీరంలోని జీవక్రియలు , హార్మోన్ల సమతుల్యతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ప్రతీ ఎనిమిది మంది మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో థైరాయిడ్ సమస్య బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళలు ఈ సమస్యతో బాధపడే అవకాశం దాదాపు ఐదు నుండి ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

ప్రధాన కారణాలు
మహిళల్లో ఈ సమస్య పెరగడానికి ముఖ్యమైన కారణం ఆటో ఇమ్యూన్ వ్యాధులు. మహిళల రోగనిరోధక వ్యవస్థ పురుషుల కంటే భిన్నంగా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యవస్థ పొరపాటున శరీరంలోని సొంత థైరాయిడ్ గ్రంథి పైనే దాడి చేస్తుంది. దీనివల్ల హాషిమోటోస్ థైరాయిడైటిస్ లేదా గ్రేవ్స్ వ్యాధి వంటి సమస్యలు తలెత్తి హార్మోన్ల ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

దీనికితోడు గర్భధారణ, ప్రసవానంతరం, మెనోపాజ్ వంటి కీలక దశలలో మహిళల శరీరంలో హార్మోన్లు చాలా వేగంగా మారతాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ హార్మోన్‌లో వచ్చే తీవ్ర వ్యత్యాసాలు థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.

హైపోథైరాయిడిజం vs హైపర్‌థైరాయిడిజం
థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ పరిమాణంలో హార్మోన్లను విడుదల చేస్తే దానిని హైపోథైరాయిడిజం అంటారు. అదే గ్రంథి శరీర అవసరాలకు మించి అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని హైపర్‌థైరాయిడిజంగా పరిగణిస్తారు.

మహిళలు విస్మరించకూడని లక్షణాలు
ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా నిరంతరం తీవ్రమైన అలసట , నీరసం ఆవహించడం ప్రధాన సంకేతం. ఆకస్మికంగా బరువు పెరగడం లేదా తగ్గిపోవడం కూడా జరుగుతుంది. అధికంగా జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, క్రమరహిత రుతుచక్రాలు లేదా గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తరచూ మూడ్ స్వింగ్స్ రావడం , మెడ భాగంలో వాపు కనిపించడం వంటి మార్పులు ఉంటే అప్రమత్తంగా ఉండాలి.

వయసు పైబడిన మహిళల్లో ఈ లక్షణాలు మెనోపాజ్ లక్షణాలను పోలి ఉండటం వల్ల వ్యాధి నిర్ధారణ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందుకే శరీరంలో ఎలాంటి మార్పులు గమనించినా నిర్లక్ష్యం చేయకుండా TSH, T3, T4 రక్త పరీక్షలు చేయించుకోవాలి. సరైన సమయానికి గుర్తించి మందులు వాడితే థైరాయిడ్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు.

గమనిక: ఈ కథనంలో అందించబడిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *