Headlines

PM Modi Appeal: మోదీ పిలుపు వెనుక అసలు కథ.. గతంలో నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ కూడా ఇలాగే చేశారా?

PM Modi Appeal: మోదీ పిలుపు వెనుక అసలు కథ.. గతంలో నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ కూడా ఇలాగే చేశారా?


PM Modi Appeal: ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాటు బంగారం కొనవద్దని చేసిన విజ్ఞప్తిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రధాని ప్రతిసారీ బాధ్యతను ప్రజలపై నెట్టివేసి, జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. అయితే, ఒక దేశ నాయకుడు ప్రజలను బంగారం కొనవద్దని కోరడం ఇదే మొదటిసారి కాదు. ఇందిరా గాంధీ నుంచి పి.చిదంబరం వరకు గతంలో ఇలాంటి విజ్ఞప్తులు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి బంగారం కీలకంగా మారిన 4 సందర్భాలు ఇవే.

1962: నగలని దానం చేసిన ఇందిరా గాంధీ

1962 భారత-చైనా యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ రక్షణ నిధికి బంగారం, నగదు దానం చేయాలని కోరారు. సాయుధ దళాల సంక్షేమం కోసం ఈ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ స్వయంగా 367 గ్రాముల బంగారు ఆభరణాలను దానం చేశారు.

1967: ఇందిరా గాంధీ విజ్ఞప్తి

జూన్ 6, 1967న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రజలను బంగారం కొనవద్దని కోరారు. ఆ సమయంలో భారత విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి ఉంది. 1965 పాకిస్థాన్ యుద్ధం తర్వాత దేశం కరువును ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు దాదాపు సున్నాకి పడిపోయాయి. అటువంటి క్లిష్ట సమయంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి క్రమశిక్షణతో ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

1991: దేశాన్ని దివాళా తీయకుండా కాపాడిన బంగారం

1991లో భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. చమురు, ఎరువుల దిగుమతుల కోసం విదేశీ మారక నిల్వలు కేవలం 3 వారాలకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి. అప్పుడు భారత్ తన వద్ద ఉన్న 20 టన్నుల బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 200 మిలియన్ డాలర్లను సేకరించింది. ఆ తర్వాత మరో 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు పంపింది. ఈ నిర్ణయమే దేశాన్ని దివాళా తీయకుండా కాపాడింది.

2013: పి. చిదంబరం విజ్ఞప్తి

యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా ప్రజలను బంగారం కొనవద్దని కోరారు. “భారత ప్రజలు నా కోరిక ఒకటి నెరవేర్చాలంటే.. అది బంగారం కొనకపోవడమే” అని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో కరెంట్ అకౌంట్ లోటు 6.7 శాతానికి చేరడంతో బంగారు దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 8 శాతానికి పెంచింది.

మోదీ ఏమన్నారు?

ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యం అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండటానికి, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లు ఆపాలని ప్రధాని మోదీ కోరారు. అలాగే ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయవచ్చని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి: Gold Buying: భారతీయులు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏమవుతుందో తెలుసా..?

ఇది కూడా చదవండి: Fuel Saving Tips: వార్నీ.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయే.. ఆ టైమ్‌లో పెట్రోల్‌ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *