2026 కేరళ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. వరుసగా ఐదోసారి అధికారంలోకి రావాలనుకున్న ఎల్‌డీఎఫ్ (LDF) ఆశలను గండి కొడుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఫాతిమా తాహిలియా. కేరళలో అత్యంత ప్రభావవంతమైన పార్టీల్లో ఒకటైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) తరపున అసెంబ్లీకి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర సృష్టించారు.
ఫాతిమా తాహిలియా విజయం సామాన్యమైనదేమీ కాదు. ఆమె వామపక్షాలకు కంచుకోటగా పేరొందిన కోజికోడ్‌లోని పెరంబ్రా నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఈ స్థానం 1980 నుండి సీపీఐ(ఎం) వశంలోనే ఉంది. అటువంటి స్థానంలో ఎల్‌డీఎఫ్ కన్వీనర్, సీనియర్ నేత టీపీ రామకృష్ణన్‌ను 5,087 ఓట్ల మెజారిటీతో ఓడించి ఫాతిమా సంచలనం సృష్టించారు. ఆమెకు 81,429 ఓట్లు రాగా, రామకృష్ణన్ 76,342 ఓట్లు సాధించారు.
34 ఏళ్ల ఫాతిమా తాహిలియా వృత్తిరీత్యా న్యాయవాది. రాజకీయాల్లో ఆమె ప్రస్థానం క్షేత్రస్థాయి నుండే ప్రారంభమైంది. గతంలో కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా పనిచేసిన ఆమె, పార్టీలో లింగ సమానత్వం కోసం నిరంతరం గళమెత్తారు. ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ (MSF) మహిళా విభాగమైన ‘హరిత’ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఆమె క్యాంపస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
ఎన్నికల సమయంలో ఫాతిమా కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థుల నుండి మతపరమైన విమర్శలు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన సైబర్ దాడులు ఎదురైనప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. హిజాబ్ ధరించే మహిళగా ఆమె సామర్థ్యాలను ప్రశ్నించిన వారికి తన గెలుపుతో సమాధానమిచ్చారు. ప్రచారంలో ఆమె అన్న మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి: “ఒక మహిళగా, ఒక ముస్లిం మహిళగా, హిజాబ్ ధరించే మహిళగా ఇక్కడికి చేరుకోవడానికి నేను ఇప్పటికే ఎన్నో అడ్డంకులను అధిగమించాను.” అని ఫాతిమా పేర్కొన్నారు.
ఫాతిమా తాహిలియా ఒక సంస్కరణవాదిగా పేరుపొందారు. గతంలో ‘హరిత’ నాయకులు కొందరు ఎంఎస్ఎఫ్ నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు, పార్టీ నాయకత్వం ఆ విషయాన్ని అణచివేయాలని చూసినా ఫాతిమా బాధితుల పక్షాన నిలబడ్డారు. ఆ క్రమంలో ఆమె తన పదవిని కూడా కోల్పోయారు. కానీ, రాజకీయాల్లో మహిళల గౌరవం కోసం ఆమె చేసిన ఆ పోరాటమే నేడు ఆమెను ఒక సామాజిక శక్తిగా మార్చింది.
సాంప్రదాయకంగా పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఐయూఎంఎల్ పార్టీలో ఫాతిమా విజయం ఒక మైలురాయి. కేవలం యువతనే కాకుండా, మార్పును కోరుకునే ప్రతి మహిళనూ ఆమె తన వైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం ముస్లిం యూత్ లీగ్ కార్యదర్శిగా ఉన్న ఫాతిమా తాహిలియా విజయం, కేరళ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, లింగ సమానత్వానికి కొత్త ఊపిరి పోసింది. ఆమె కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, అణిచివేతను ఎదిరించే ఒక శక్తివంతమైన గళం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..