దక్షిణాఫ్రికాలోని కొమాటి నదిలో ఉండే ఓ మొసలి కడుపులో మానవ అవశేషాలు వెలికితీత సంచలనం రేపింది. వ్యాపారవేత్త అదృశ్యానికి ఇదే కారణమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. మొసలి కడుపులో ఒకటి రెండు కాదు.. ఏకంగా పలువురు వాడినట్లున్న క్రాక్స్, చెప్పులు బయటపడటం కేసును మరింత మిస్టరీగా మార్చింది. దీంతో ఒక్కరే కాదు.. మరికొందరు కూడా ఈ మొసలి బారిన పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కొమాటి పోర్ట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొమాటి నది పరిసరాల్లో కనిపించిన ఈ మొసలిని పోలీసులు, అత్యవసర సేవల బృందాలు కొన్ని రోజుల పాటు ట్రాక్ చేశాయి. హెలికాప్టర్, డ్రోన్ల సాయంతో కదలికలను గమనించి చివరకు పట్టుకున్నారు. మరో దారి లేని నేపథ్యంలో దానిని మృతి చెందేలా చేయాల్సి వచ్చినట్లు అధికారులు తెలిపారు. మిస్సింగ్‌గా నమోదైన 59 ఏళ్ల వ్యాపారవేత్త కోసం గత వారం రోజులుగా గాలింపు కొనసాగుతోంది. అతని వాహనం లోతట్టు వంతెన వద్ద చిక్కుకుపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. అదే ప్రాంతంలో తిరుగుతున్న మొసలిపై అనుమానం రావడంతో దానిని లక్ష్యంగా చేసుకున్నారు.
మొసలిని బయటకు తీయడంతో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా కడుపులో మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఇవి అదృశ్యమైన వ్యాపారవేత్తవేననే అనుమానం వ్యక్తమవుతున్నా, డీఎన్ఏ పరీక్షల ద్వారా పూర్తి స్థాయిలో నిర్ధారణ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. మొసలి కడుపులో సుమారు ఆరు జతల క్రాక్స్, చప్పట్లు కూడా బయటపడటం. ప్లాస్టిక్ పదార్థాలు జీర్ణం కాకపోవడం వల్ల అవి అలాగే మిగిలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ చెప్పులు గతంలో మరికొందరు బాధితులకు చెందినవే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో మొసళ్ల ఉనికి, వాటి దాడులపై భయాందోళనలు పెరిగాయి. నీటి వనరుల దగ్గర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యాపారవేత్త అదృశ్యం నుంచి మొదలైన ఈ కేసు.. ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తూ సంచలనంగా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..