తమిళనాడులో విజిల్ మోత మోగిపోతోంది. ఇది మామూలు విజయం కాదు. ఐదు దశాబ్దాల సాంప్రదాయ రాజకీయాలను చీల్చుకుంటూ.. రెండేళ్లలోనే ప్రభంజనం సృష్టించారు టీవీకే అధినేత విజయ్. తమిళగడ్డపై 49 ఏళ్ల తర్వాత ఓ కొత్త పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. డీఎంకే, అన్నాడీఎంకేల కోటలను బద్దలుకొడుతూ.. దళపతి విజయ్, తమిళగ వేట్రి కళగం సంచలన విజయం సాధించింది. ఆయన చెప్పినట్లే ప్రత్యర్థుల కంచుకోటల్లో తన పార్టీ జెండాను పాతారు. ముఖ్యంగా టీవీకే అధికార డీఎంకేను కోలుకోలేని దెబ్బ కొట్టింది. అదే సమయంలో అన్నాడీఎంకే, బీజేపీ కలిసిన NDA కూటమిని కూడా వెనక్కి నెట్టింది. టోటల్గా ఐదు దశాబ్దాల సంప్రదాయాన్ని కాదని.. విజయ్ ప్రభంజనాన్ని సృష్టించారు. అయితే.. ఈ ఎన్నికల్లో సీఎం స్టాలిన్ సహా.. పలువురు మంత్రులు ఘోర పరాజయం చవిచూశారు. కొలత్తూరులో స్టాలిన్ ఓటిమిపాలయ్యారు. స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరులో టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు విజయం సాధించారు.