ప్రతి నెలా కరెంట్ బిల్ ఫ్రీ.. పైగా అకౌంట్లోకి రూ.78వేలు.. కేంద్రం తెచ్చిన అదిరే స్కీమ్ గురించి తెలుసా..?

ప్రతి నెలా కరెంట్ బిల్ ఫ్రీ.. పైగా అకౌంట్లోకి రూ.78వేలు.. కేంద్రం తెచ్చిన అదిరే స్కీమ్ గురించి తెలుసా..?


ఎండలు మండిపోతున్నాయి.. ఏసీలు, కూలర్ల వాడకంతో కరెంట్ బిల్లులు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మధ్యతరగతి కుటుంబాలకు పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ఒక గొప్ప వరంగా మారింది. 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం.. 2026 నాటికి లక్షలాది ఇళ్లకు వెలుగునిస్తోంది. కేవలం విద్యుత్ ఆదా చేయడమే కాకుండా సామాన్యులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. 2027 నాటికి దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటికే 26.19 లక్షల కుటుంబాలు తమ ఇళ్లపై సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందాయి. దీని కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా రూ.17,967.53 కోట్ల సబ్సిడీని నేరుగా ప్రజల ఖాతాల్లోకి విడుదల చేసింది.

ఉచిత విద్యుత్ – ఆదాయం

ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం చేసే వారికి బిల్లు సున్నా అవుతుంది. మీ వినియోగం పోను మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఏడాదికి వేల రూపాయల ఆదాయాన్ని కూడా పొందవచ్చు. సోలార్ ప్యానెళ్ల జీవితకాలం సుమారు 25 ఏళ్లు ఉంటుంది. అంటే ఒకసారి పెట్టుబడి పెడితే పాతికేళ్ల పాటు కరెంట్ బిల్లుల చింత ఉండదు.

సబ్సిడీ లెక్కలు ఇవే

మీరు ఏర్పాటు చేసుకునే సోలార్ ప్లాంట్ సామర్థ్యాన్ని బట్టి సబ్సిడీ మారుతుంది.

1-2 కిలోవాట్లు: నెలకు 0-150 యూనిట్ల వినియోగం ఉన్నవారికి ఇది సరిపోతుంది. దీనికి రూ.30,000 నుండి రూ.60,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.

2-3 కిలోవాట్లు: నెలకు 150-300 యూనిట్ల వినియోగం ఉన్నవారికి ఇది అనువైనది. దీనిపై రూ.60,000 నుండి రూ.78,000 వరకు గరిష్ట సబ్సిడీ పొందవచ్చు.

3 కిలోవాట్ల పైన: గరిష్టంగా రూ.78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.

గుజరాత్ అగ్రస్థానం.. తెలుగు రాష్ట్రాల్లోనూ జోరు

ఈ పథకాన్ని వినియోగించుకోవడంలో గుజరాత్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అవగాహన పెరుగుతుండటంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుంది:

రిజిస్ట్రేషన్: అధికారిక వెబ్‌సైట్ ([pmsuryaghar.gov.in](https://pmsuryaghar.gov.in)) లో మీ రాష్ట్రం, విద్యుత్ కంపెనీ పేరు, కస్టమర్ నంబర్ ఇచ్చి నమోదు చేసుకోవాలి.

అప్లికేషన్: Apply for Rooftop Solar ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఇన్‌స్టాలేషన్: అనుమతి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆమోదించిన వెండర్ ద్వారా మాత్రమే ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలి.

నెట్ మీటర్ – సబ్సిడీ: ప్యానెళ్లు అమర్చిన తర్వాత నెట్ మీటరింగ్ కోసం దరఖాస్తు చేయాలి. వెరిఫికేషన్ పూర్తయిన 30 రోజుల్లో సబ్సిడీ సొమ్ము నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

పెరుగుతున్న విద్యుత్ ఛార్జీల నుండి శాశ్వత విముక్తి పొందడానికి పీఎం సూర్య ఘర్’ ఒక అద్భుతమైన అవకాశం. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు, మీ ఇంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *