మినపప్పు సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : మినపప్పు మూడు కప్పులు, బెల్లం లేదా చెక్కర రెండు కప్పులు, నెయ్యి ఒక కప్పు, యాలకుల పొడి వన్ టీ స్పూన్, జీడి పప్పు, బాదం రెండు టేబుల్ స్పూన్స్.
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మినపప్పును మంచిగా వేయించుకోవాలి. పొట్టు ఉన్నా లేకపోయినా ఏ పప్పు తీసుకున్నా పర్వా లేదు. మినపప్పు మంచిగా వేగిన తర్వాత దీనిని వేరే బౌల్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి.
ఇప్పుడు బాదం, జీడి పప్పు, బెల్లం పొడి లేదా చక్కెర ను తీసుకొని, మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా తయారు చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మినపప్పును కూడా చాలా మెత్తగా సున్నుండల తయారీకి సరిపోయేలా మిక్సీ పట్టుకోవాలి.
తర్వాత ఈ రెండు పొడులను ఒకే బౌల్లోకి తీసుకొని , అందులో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేడి చేయాలి. నెయ్యి వేడిగా ఉన్న సమయంలోనే ఈ మిశ్రమంలో పోస్తూ , సున్నుండలు తయారు చేసుకోవాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న లడ్డూలలో తయారు చేసుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత సున్నుండలు తయారు చేసుకుంటే అవి సరైన విధానంలో రావు. ఇక వీటిని సున్నుండలుగా తయారు చేసుకొన్న తర్వాత వాటిపై గార్నిష్ కోసం వేయించిన జీడిపప్పు, బాదం పెట్టుకోవచ్చు. అంతే టేస్టీ టేస్టీ, ఆరోగ్యాన్నిచ్చే మినపప్పు సున్నుండలు రెడీ.




