Telangana: కండక్టర్ కన్నింగ్ ప్లాన్.. చెకింగ్ అధికారిపై దాడి ఘటనలో వెలుగులోకి సంచలన నిజాలు

Telangana: కండక్టర్ కన్నింగ్ ప్లాన్.. చెకింగ్ అధికారిపై దాడి ఘటనలో వెలుగులోకి సంచలన నిజాలు


చెకింగ్ ఇన్‌స్పెక్టర్‌పై కండక్లర్ దాడి ఘటనపై టీజీఎస్ఆర్టీసీ తీవ్రంగా స్పందించింది. దాడికి పాల్పడిన కండక్టర్‌పై చర్యలకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో, TGSRTC హెడ్ క్వార్టర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ పెడ్డదొడ్డి యేసయ్య ఇన్-ఛార్జ్ టిటిఐ, వి.ప్రకాష్ టిటిఐలు తన బృందంతో కలిసి జహీరాబాద్‌ – నారాయణఖేడ్ మార్గంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఝరాసంగం మండలం కప్పడ్ గ్రామ సమీపంలో నారాయణఖేడ్ డిపోకు చెందిన TG15-Z-0082 నెంబర్ గల బస్సును తనిఖీ చేయగా కండక్టర్ ఒక ప్రయాణికుడి వద్ద నుండి రూ. 20 నగదు తీసుకొని టికెట్ జారీ చేయనట్లు గుర్తించారు.

​దీంతో తనిఖీ అధికారులు, నిబంధనల ప్రకారం కండక్టర్‌కు ఛార్జ్ మెమో జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆ కండక్టర్ దేవ్‌సోత్ వసంత్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అధికారులను విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, బస్సులోని ప్రయాణికులను అధికారులపైకి రెచ్చగొట్టాడు. అంతటితో ఆగకుండా తన కాలి చెప్పుతో అధికారులపై దాడికి తెగబడ్డాడు. అధికారుల నుంచి రికార్డులను లాక్కొని దౌర్జనానికి దిగాడు.

ఈ దాడిలో టిటిఐ ఇన్-ఛార్జ్ యేసయ్య ఎడమ చేతి వేలికి గాయం కాగా, మరో అధికారి ప్రకాష్‌ నుదుటిపై తీవ్రమైన గాయాలయ్యాయి.
ఈ ఘటనపై బాధిత చెకింగ్ అధికారి యేసయ్య రాయికోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు క్రైమ్ నంబర్ 46/2026 కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 121(1) (ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఉండగా అడ్డుకోవడం, గాయపరచడం కింద కండక్టర్ దేవ్‌సోత్ వసంత్ , దాడిలో పాల్గొన్న ప్రయాణికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారులను తప్పుదోవ పట్టించేలా కండక్టర్ వ్యవహరించిన తీరుపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పందిస్తూ, సంస్థలో సిబ్బంది క్రమశిక్షణారాహిత్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కేవలం టికెట్ లేని ప్రయాణికుడి కేసు నుండి తప్పించుకోవడానికి అధికారులపై దాడి చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై ఇటువంటి దాడులకు పాల్పడితే చట్టపరంగా శిక్షలు తప్పవని, ఉద్యోగులందరూ సహృద్భావ వాతావరణంలో పనిచేయాలని ఆయన సూచించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *