టాలీవుడ్ విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సినీ ప్రయాణంలో జరిగిన ఒక వింతైన సంఘటన గురించి చెప్పారు. అది తన ప్రాణ స్నేహితుడు, దర్శకుడు కృష్ణవంశీతో ఆయనకు ఏర్పడిన విభేదాల గురించి చెప్పుకొచ్చారు.
జేడీ చక్రవర్తి, కృష్ణవంశీ ఒకప్పుడు ఎంతటి ప్రాణ స్నేహితులు అంటే.. ఒకరి ఇంట్లో ఒకరు ఉండేవారు. కానీ, ‘గులాబీ’ సినిమా వీరిద్దరి జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మహేశ్వరి(పూజ పాత్ర) పట్ల ఇద్దరికీ ఒకేసారి ఆకర్షణ కలిగింది. ఒకరికొకరు తెలియకుండానే ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఇద్దరూ తెగ ప్రయత్నించేవారు. “నేను రెండు చాక్లెట్లు ఇస్తే, కృష్ణవంశీ ఏకంగా ఒక డబ్బా చాక్లెట్లు ఇచ్చేవాడు” అని జేడీ నవ్వుతూ ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కేవలం హీరోయిన్‌ను కలవడం కోసం అరకు నుంచి వైజాగ్ వరకు రాత్రిపూట సీక్రెట్ ట్రావెల్స్ చేసేవారట.
అయితే, ఈ ఆరోగ్యకరమైన పోటీ మెల్లమెల్లగా వారి మధ్య దూరాన్ని పెంచింది. ప్రేమ విషయంలో వచ్చిన పోటీ కారణంగా ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. ఈ విభేదాలను ఎవరూ సర్దుబాటు చేయకపోగా, చుట్టూ ఉన్నవారు ‘డివైడ్ అండ్ రూల్’ పాలసీతో తమ మధ్య ఉన్న గ్యాప్‌ను ఇంకా పెంచారని జేడీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పటికీ, ఆనాటి పాత క్లోజ్‌నెస్ మాత్రం తిరిగి రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. కృష్ణవంశీ అద్భుతమైన దర్శకుడని ఇప్పటికీ జేడీ చక్రవర్తి కొనియాడుతుండటం విశేషం.
Also Read: కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!