Andhra Pradesh: మహిళా సీఐని ఎక్సైజ్ శాఖ ఎందుకు సస్పెండ్ చేసిందో తెలిస్తే షాకవుతారు..

Andhra Pradesh: మహిళా సీఐని ఎక్సైజ్ శాఖ ఎందుకు సస్పెండ్ చేసిందో తెలిస్తే షాకవుతారు..


రక్షకభటులే భక్షకులుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. అక్రమ మద్యాన్ని అదుపు చేయాల్సిన ఒక బాధ్యతాయుతమైన సీఐ, ఆ మద్యాన్నే వ్యాపారంగా మార్చుకున్నారు. సీజ్ చేసిన స్టాక్‌ను బయట వ్యక్తులకు అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు. నంద్యాల జిల్లా డోన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వరలక్ష్మి, ఇటీవల కాలంలో వివిధ దాడుల్లో సుమారు 350 క్వార్టర్లకు పైగా అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. నిబంధనల ప్రకారం ఆ మద్యాన్ని భద్రపరచాల్సి ఉండగా, ఆమె తన వక్రబుద్ధిని ప్రదర్శించారు. ప్యాపిలి మండలం పి.ఆర్. పల్లిలో జరిగిన ఒక వేడుక సందర్భంగా సోమనాథ్ అనే వ్యక్తికి ఈ మద్యాన్ని రహస్యంగా విక్రయించారు.

గుట్టు రట్టయ్యిందిలా..

డోన్ శివార్లలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, కారులో తరలిస్తున్న భారీ మద్యం నిల్వలతో సోమనాథ్ దొరికిపోయాడు. పోలీసుల విచారణలో అతను చెప్పిన సమాధానం విని అధికారులు అవాక్కయ్యారు. “నాకు ఈ మద్యాన్ని ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి అమ్మారు” అంటూ సోమనాథ్ తన కన్ఫెషన్ రిపోర్టులో తెలిపాడు. దీంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది.

కేసు నమోదు – సస్పెన్షన్ వేటు

సోమనాథ్ ఇచ్చిన సమాచారం మేరకు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విచారణ జరిపి, సీఐ వరలక్ష్మిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఎక్సైజ్ శాఖ అంతర్గత విచారణ జరిపి, ఆరోపణలు నిజమేనని తేలడంతో నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆమెను సస్పెండ్* చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మిగతా వారి పరిస్థితి ఏంటి..?

ఈ కేసులో కేవలం వరలక్ష్మిని మాత్రమే బలిపశువును చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో 24 గంటల పాటు సిబ్బంది ఉంటారు. అంత పెద్ద మొత్తంలో మద్యాన్ని బయటకు తీసుకెళ్తుంటే మిగతా సిబ్బందికి తెలియకుండానే జరిగిందా?, ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా గతంలో సీజ్ చేసిన మద్యం నిల్వలు ఎంత ఉన్నాయి?, అవి ఎక్కడ ఉన్నాయి? అనే దానిపై లోతైన విచారణ జరిగితే మరిన్ని ఆసక్తికరమైన, షాకింగ్ విషయాలు బయటపడే అవకాశం ఉంది.

కేవలం సీఐ వరలక్ష్మిపై మాత్రమే కాకుండా ఈ దందాలో సహకరించిన మిగతా సిబ్బందిపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయి. అక్రమ మద్యం విషయంలో కంచే చేను మేసిన చందంగా మారిన ఈ ఘటన జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *