IPL 2026 : క్రికెట్ చచ్చిపోయింది.. ఐపీఎల్ ఒక బిజినెస్.. మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు

IPL 2026 :  క్రికెట్ చచ్చిపోయింది.. ఐపీఎల్ ఒక బిజినెస్.. మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు


IPL 2026 : ఐపీఎల్ 2026లో పరుగుల వరదపారడం చూస్తుంటే బౌలర్లకు ఇది క్రికెట్ కాదని, ఒక పీడకల అనిపిస్తోంది. 260కి పైగా పరుగులు కేవలం 19 ఓవర్లలోనే ఛేజ్ అయిపోతున్నాయి. బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్లు కూడా వికెట్లు తీయలేక ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అసలు ఐపీఎల్‌లో ఏం జరుగుతోంది? కేవలం బ్యాటర్ల కోసమే ఈ టోర్నీని నిర్వహిస్తున్నారా? అనే ప్రశ్నలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ కోచ్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ షాకింగ్ ఆన్సర్స్ అందించారు. ఐపీఎల్ వెనుక ఉన్న అసలైన బిజినెస్ గుట్టును రట్టు చేశారు.

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మురళీధరన్ మాట్లాడుతూ.. ఐపీఎల్ అనేది ఇప్పుడు ఒక భారీ బిజినెస్ అని కుండబద్దలు కొట్టారు. ప్రేక్షకులు మైదానానికి వచ్చేది కేవలం ఫోర్లు, సిక్సర్లు చూడటానికేనని, ఒకవేళ పిచ్‌లు బౌలర్లకు అనుకూలంగా ఉండి స్కోర్లు తక్కువగా నమోదైతే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారని ఆయన అన్నారు. ఫలితంగా స్పాన్సర్లు, యాడ్స్, టీవీ వ్యూవర్‌షిప్ తగ్గిపోయి బిజినెస్ పరంగా భారీ నష్టం వాటిల్లుతుందని, అందుకే ఐపీఎల్ ఇలా మారిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.

నేటి తరం క్రికెటర్లు ఎంతటి గొప్ప బౌలర్లనైనా ఎదుర్కొనడానికి భయపడడం లేదని మురళీధరన్ అన్నారు. జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ బంతి వేస్తున్నా, సలీల్ అరోరా లాంటి కుర్రాడు నో లుక్ సిక్స్ కొట్టగలుగుతున్నాడంటే వాళ్ల కాన్ఫిడెన్స్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. తాము ఆడే రోజుల్లో 6 ఓవర్లలో 40-50 పరుగులు చేస్తే గొప్ప స్కోర్ అని, ఇప్పుడు అది 80-90 కి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. బ్యాటర్ల మైండ్ సెట్ ఇప్పుడు ఎలా డిఫెండ్ చేయాలి అని కాకుండా ఎలా సిక్స్ కొట్టాలి అనే విధంగా మారిపోయిందని తెలిపారు.

స్పిన్నర్లు కూడా ఇప్పుడు బంతిని టర్న్ చేయడానికి ప్రయత్నించడం లేదని, కేవలం వేగంగా వేసి బౌండరీలు కాపాడుకోవాలని చూస్తున్నారని మురళీ విచారం వ్యక్తం చేశారు. 10-12 ఏళ్ల వయస్సు నుంచే బంతిని టర్న్ చేయడం నేర్చుకోవాలని, కానీ నేటి కుర్రాళ్లు థ్రోడౌన్ బంతులను ఎదుర్కొని సిక్సర్లు బాదడంలోనే శిక్షణ పొందుతున్నారని అన్నారు. ఫలితంగా స్పిన్నర్లు కూడా నెట్స్‌లో థ్రోడౌన్ బౌలర్లలా మారిపోతున్నారని, బ్యాటర్లకు ఇది మరింత సులభంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఐపీఎల్‌లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ బౌలర్ల పనిని మరింత కష్టతరం చేసిందని మురళీధరన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రతి టీమ్ ఒక అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగుతుందని, ఓపెనర్లు వికెట్ పోతుందన్న భయం లేకుండా మొదటి బంతి నుంచే విరుచుకుపడుతున్నారని చెప్పారు. బౌండరీలను వెనక్కి జరిపినా పెద్దగా ఫలితం ఉండదని, ఇదంతా ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించిన ఫార్మాట్ కాబట్టి బౌలర్లు దీనికి అలవాటు పడక తప్పదని ఆయన తేల్చి చెప్పారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *