
ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఒక వింత, విషాదకర సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పెళ్లి వేడుకల్లో సందడి చేసే DJ సంగీతం, ఒక పౌల్ట్రీ ఫారమ్ యజమానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. పెళ్లి ఊరేగింపులో మోగించిన మితిమీరిన శబ్దం కారణంగా ఏకంగా 140 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ విషాద ఘటన సుల్తాన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
సుల్తాన్‌పూర్ జిల్లా కుడ్వార్ ప్రాంతంలోని రామ్ భద్ర పూర్వ గ్రామానికి చెందిన బబ్బన్ విశ్వకర్మ కుమార్తె వివాహం సందర్భంగా ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు గ్రామంలోని సబీర్ అలీకి చెందిన పౌల్ట్రీ ఫారమ్ ముందు నుండి వెళ్తున్న సమయంలో, DJ నుండి అత్యంత భారీ స్థాయిలో సంగీతం వినిపించింది. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆ భీకర శబ్దానికి కోళ్లు విలవిలలాడిపోయాయి.
DJ సౌండ్ పెరగగానే ఫారమ్‌లోని కోళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యాయని సబీర్ అలీ తెలిపారు. ఆ హై-డెసిబెల్ శబ్దాన్ని తట్టుకోలేక కోళ్లు ఒకదానిపై ఒకటి పడి ఊపిరాడక, మరికొన్ని గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయని వివరించారు. యజమాని సబీర్ ఎంత వేడుకున్నా, ఊరేగింపులో ఉన్నవారు సంగీతాన్ని తగ్గించలేదని, పైగా తనపై దురుసుగా ప్రవర్తించారని అతను ఆరోపించాడు. మరుసటి రోజు ఉదయానికి 140 కోళ్లు చనిపోయి ఉండటం చూసి అతను షాక్‌కు గురయ్యాడు.
ఈ నష్టంపై సబీర్ అలీ స్థానిక పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు. తన జీవనోపాధిని దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. పశువైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోళ్లు చాలా సున్నితమైన జీవులని, హఠాత్తుగా వచ్చే భారీ శబ్దాల వల్ల అవి తీవ్రమైన ఒత్తిడికి (Stress) లోనై గుండెపోటుతో మరణించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటన ధ్వని కాలుష్యం మూగజీవాలపై ఎంతటి ప్రమాదకర ప్రభావాన్ని చూపుతుందో మరోసారి నిరూపించింది. వేడుకల పేరుతో చేసే అతి, ఇతరుల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించకూడదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..