రాగి లడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బలమైన స్వీట్ రెసిపీ. ఈ లడ్డులను ఇంట్లోనే సులభంగా, తక్కువ నెయ్యితో తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. రాగి లడ్డు తయారీకి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వారు దీనిని స్కిప్ చేయవచ్చు. నెయ్యి వేడయ్యాక, ఒక కప్పు రాగి పిండిని వేసి మీడియం (మీకు కావాలంటే.. ఎక్కువ పరిమాణంలో కూడా తీసుకోవచ్చు) ఫ్లేమ్‌లో 9-10 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. వేయించిన రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
తరువాత, అదే పాన్‌లో పావు కప్పు పల్లీలను డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నవారు కాజు లేదా బాదంను కూడా పావు కప్పు వరకు వేయించుకోవచ్చు. పల్లీలు చల్లారాక వాటి పొట్టు తీసి, మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా పలుకుపలుకుగా గ్రైండ్ చేయాలి. ఈ పల్లీ పొడిని కూడా వేయించిన రాగి పిండిలో కలపాలి. చిటికెడు ఉప్పు (ఐచ్ఛికం), అర టీస్పూన్ యాలకుల పొడిని కూడా ఈ మిశ్రమంలో కలపాలి.
ఇప్పుడు బెల్లం పాకం తయారీకి, అదే పాన్‌లో రెండు వంతులు బెల్లం (స్వీట్ ఎక్కువగా కావాలంటే ముప్పావు కప్పు), పావు కప్పు నీళ్లు కలిపి బెల్లం కరిగించాలి. మంటను తక్కువగా ఉంచి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, లేత తీగ పాకం వచ్చేవరకు ఉడికించాలి. పాకం మరీ ముదిరితే లడ్డు గట్టిగా అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ బెల్లం సిరప్‌ను స్టవ్ ఆఫ్ చేసి, రాగిపిండి మిశ్రమంలో వడగట్టి కలుపుకోవాలి. బెల్లం స్వచ్ఛమైనదైతే వడగట్టకుండా నేరుగా కలపవచ్చు.
వేడిగా ఉన్న మిశ్రమాన్ని మూడు నాలుగు నిమిషాలు చల్లారనిచ్చి, గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులుగా చుట్టుకోవాలి. మిశ్రమం పూర్తిగా చల్లారిపోతే లడ్డులు చుట్టడం కష్టమవుతుంది. ఒకవేళ లడ్డు మిశ్రమం పొడిపొడిగా అనిపిస్తే, ఒకటి లేదా రెండు టీస్పూన్ల నెయ్యిని లేదా కాచి చల్లార్చిన పాలను కలిపి లడ్డులను సులభంగా చుట్టవచ్చు. ఇలా తయారుచేసిన రాగి లడ్డులు రుచికరంగా ఉండటమే కాకుండా, ఎయిర్ టైట్ కంటైనర్‌లో 20-25 రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఇంకా ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు దోహదపడతాయి.. ఇవి పిల్లా పెద్దా అందరికీ నచ్చే, శరీరానికి బలాన్నిచ్చే మంచి ఆరోగ్యకరమైన స్వీట్.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..