బంగారం విషయంలో కొత్త ట్రెండ్‌! ఆభరణాలకు తగ్గిన డిమాండ్.. వాటిపై పెరిగిన ఆసక్తి

బంగారం విషయంలో కొత్త ట్రెండ్‌! ఆభరణాలకు తగ్గిన డిమాండ్.. వాటిపై పెరిగిన ఆసక్తి


భారతీయుల్లో పసిడి పట్ల ఉన్న ఆకర్షణ ఇప్పుడు కొత్త దిశగా మలుపు తిరుగుతోంది. సంప్రదాయంగా ఆభరణాల రూపంలో కొనుగోలు చేసే బంగారం స్థానంలో, పెట్టుబడి సాధనంగా మేలిమి (24 క్యారెట్ల) బంగారం, బిస్కెట్లు, నాణేలు, అలాగే డిజిటల్ రూపాల్లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (WGC) తాజా నివేదిక ఈ మార్పును స్పష్టంగా చూపిస్తోంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారతదేశంలో పెట్టుబడి రీత్యా బంగారం కొనుగోళ్లు 54 శాతం పెరిగి 82 టన్నులకు చేరుకోగా, ఆభరణాల గిరాకీ మాత్రం 19 శాతం తగ్గి 66 టన్నులకు పరిమితమైంది. విలువ పరంగా చూస్తే, మొత్తం గిరాకీ రూ.68,100 కోట్ల నుంచి 47 శాతం పెరిగి రూ.99,900 కోట్లకు చేరడం గమనార్హం. మొత్తంగా ఈ త్రైమాసికంలో దేశీయ పసిడి గిరాకీ 151 టన్నులకు చేరి, గత ఏడాదితో పోలిస్తే 10 శాతం వృద్ధిని నమోదు చేసింది.

బంగారం బిస్కెట్లు, నాణేలకు డిమాండ్ మరింత వేగంగా పెరిగింది. ఈ విభాగంలో గిరాకీ 34 శాతం పెరిగి 62 టన్నులకు చేరుకోవడం 2013 తర్వాత అత్యధిక స్థాయి. విలువ పరంగా ఇది 142 శాతం వృద్ధితో రూ.94,100 కోట్లకు చేరింది. ఇదే సమయంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో కూడా పెట్టుబడులు పెరిగి, 20 టన్నుల నికర గిరాకీ నమోదైంది. స్టాక్ మార్కెట్లు స్థిరంగా లేకపోవడం, బంగారం ధరలు పెరుగుతుండటం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పాత బంగారం మార్పిడి (ఎక్స్చేంజ్) కూడా 20 శాతం పెరిగి 31.2 టన్నులకు చేరింది. అలాగే దేశీయ డిమాండ్‌ను తీర్చేందుకు బంగారం దిగుమతులు 39 శాతం పెరిగి 186 టన్నులకు చేరడం గమనించాల్సిన విషయం.

2026 మొత్తానికి దేశంలో 650-750 టన్నుల వరకు బంగారం గిరాకీ ఉండొచ్చని అంచనా. ఇందులో సుమారు 41 శాతం పెట్టుబడుల కొనుగోళ్లే ఉండే అవకాశముంది. ఇది 2000 తర్వాత అత్యధిక స్థాయి కావడం విశేషం. ప్రపంచ గిరాకీలో భారత్ వాటా 13 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా కూడా పసిడి ప్రాధాన్యం పెరుగుతోంది. గ్లోబల్ డిమాండ్ 2 శాతం పెరిగి 1231 టన్నులకు చేరుకోగా, విలువ పరంగా 74 శాతం వృద్ధి నమోదైంది. అయితే ఆభరణాల గిరాకీ ప్రపంచవ్యాప్తంగా 23 శాతం తగ్గింది. ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. అదే సమయంలో బిస్కెట్లు, నాణేలపై పెట్టుబడులు 42 శాతం పెరగడం గమనార్హం.

సచిన్‌ జైన్‌ ప్రకారం అధిక ధరలు ఆభరణాల డిమాండ్‌పై ఒత్తిడి తీసుకురాగలవు. కానీ పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ వంటి పండగలు కొంత ఊరటనిస్తాయి. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య బంగారం ఒక సురక్షిత పెట్టుబడి సాధనంగా కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే భారతీయులు ఇప్పుడు బంగారాన్ని కేవలం అలంకరణ కోసం కాకుండా, భద్రమైన పెట్టుబడి సాధనంగా భావిస్తూ కొనుగోళ్లు పెంచుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *