
టాలీవుడ్ ప్రముఖ నటుడు నరేశ్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు నరేష్. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. అంతే కాదు ఇప్పటికీ ఆయన తన ఫిట్నెస్ తో అందరూ షాక్ అయ్యేలా చేస్తున్నారు నరేష్. గతంలో ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలోని అనేక అంశాలను పంచుకున్నారు. ఆయన తన ఆరోగ్య రహస్యాలు, దైనందిన జీవనం, ఆహారపు అలవాట్లు, ఆధ్యాత్మిక నమ్మకాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నరేశ్ తన దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి వ్యక్తికి విభిన్నమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఉంటాయని ఆయన అన్నారు. ఉదయం 6 గంటలకు లేచి, వాకింగ్ చేస్తూనే రోజువారీ ప్లానింగ్ చేసుకుంటారట. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలి, వృథా చేయకూడదు అనే సూత్రాన్ని పాటిస్తారట. ఒక చెట్టుకు నీళ్ళు పోయడం లేదా ఒకరికి చిన్న సహాయం చేయడం వంటి చిన్న మంచి పనులను తన రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటారట.
ఆయన కృష్ణ, విజయనిర్మల వంటి వారసత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చినందున, ఫుడ్ లవర్ అని, ఇంట్లో కిచెన్ ఎప్పుడూ అద్భుతంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. నరేశ్ తన జీవితంలో ఆర్థికంగా, వృత్తిపరంగా తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. ఒకప్పుడు తన జోబులో వంద రూపాయలు కూడా లేని రోజులు ఉన్నాయని, తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యానని పంచుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాకు దూరమవ్వడం, వ్యాపారంలో నష్టపోవడం వంటి కారణాలతో బీచ్ హౌస్ అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ కష్టాల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నప్పుడు, శిర్డీ సాయిబాబా దర్శనంతో తన జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చిందని నమ్మారు. సాయిబాబా టెంపుల్‌కు వెళ్ళడం, ప్రార్థించడం ద్వారా మానసిక ప్రశాంతత పొంది, తిరిగి సినిమాల్లోకి వచ్చారు. కెరీర్‌లో డీవియేషన్లు ఉన్నప్పటికీ, 60 ఏళ్ల వయసులో కూడా ఇంత మంచి కెరీర్ లభించడం దైవానుగ్రహమే అని భావిస్తున్నారు.
అలాగే నరేష్ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ, చల్లటి నీళ్లు తాగడం వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఉదయం పూట చల్లటి నీటిని తాగకూడదని, గోరువెచ్చని నీళ్లను మాత్రమే తీసుకోవాలని ఆయన సూచించారు. ఉదయాన్నే శరీరం మేల్కొనే క్రమంలో చల్లటి నీళ్లు హానికరం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, నరేష్ తన రోజువారీ ఆరోగ్య అలవాటు గురించి వివరిస్తూ.. ఆయన ప్రతిరోజూ ఉదయం 4:30 లేదా 5:00 గంటలకు ఒక ప్రత్యేక మిశ్రమాన్ని తాగుతానని తెలిపారు. ఈ “గోల్డెన్ వాటర్”లో పసుపు, క్యుర్క్యుమిన్ ఏర్పడటానికి చిటికెడు మిరియాలు, దంచిన అల్లం అలాగే నిమ్మరసం కలుపుతానని. ఈ పానీయం ఇన్ఫ్లమేషన్లు, ఒంటి నొప్పులను తగ్గించి, శరీరానికి బలాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి దెబ్బలు తగిలిన త్వరగా కోలుకోవడానికి ఈ డ్రింక్ పనిచేస్తుందని నరేష్ అన్నారు. ఇది తన వ్యక్తిగత అనుభవం అని, వైద్య సలహా కాదని స్పష్టం చేశారు. అయితే, ఈ పానీయం చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.