‘నిశ్శబ్ద హత్యాకాండ’..! మాయమైన 3,127 గర్భిణీలు.. విచారణలో బయటపడ్డ చేదు నిజాలు..!

‘నిశ్శబ్ద హత్యాకాండ’..! మాయమైన 3,127 గర్భిణీలు.. విచారణలో బయటపడ్డ చేదు నిజాలు..!


కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో వెలుగుచూసిన గర్భస్థ శిశువుల అదృశ్యం ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆరోగ్య శాఖ వద్ద నమోదైన వేలాది మంది గర్భిణీ స్త్రీల వివరాలు, వారి ప్రసవాల లెక్కలు గాలిలో కలిసిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దీని వెనుక భారీ స్థాయిలో అక్రమ ఆడ భ్రూణహత్యలు జరిగి ఉండవచ్చనే అనుమానాలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

యాదగిరి జిల్లాలో ఏడు నెలల వ్యవధిలోనే సుమారు 30 ఆడ భ్రూణహత్యలు జరిగాయంటూ ‘కన్నడ ప్రభ’ పత్రిక మార్చి 18న ప్రచురించిన కథనంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ నివేదికను తీవ్రంగా పరిగణించిన ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూ రావు, ముఖ్య కార్యదర్శి హర్ష గుప్తా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు.

ఆరోగ్య శాఖ రహస్య నివేదిక ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో గర్భాల నమోదుకు, ప్రసవాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. ఏప్రిల్ నుండి నవంబర్ 2025 వరకు ఏడు నెలల కాలంలో ఆ శాఖలో అధికారికంగా 652 అబార్షన్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అబార్షన్ల సగటు 5.24% కాగా, యాదగిరి జిల్లాలోనే ఇది 3.16%గా ఉంది. 2024-25 కాలానికి సంబంధించిన డేటా మరింత ఆందోళనకరంగా ఉంది. మొత్తం 31,435 మంది గర్భిణీ స్త్రీలు నమోదయ్యారు. వీరిలో 26,584 సజీవ జననాలు, 188 శిశు మరణాలు సంభవించాయి. మరో 207 ప్రసవాలు ఇంకా జరగాల్సి ఉంది. 1,329 గర్భస్రావాలుగా నమోదయ్యాయి. కానీ వీటన్నింటినీ కలిపితే, మొత్తం కేవలం 28,308 మాత్రమే. దీంతో 3,127 కేసులు పూర్తిగా లెక్కలోకి రాకుండా పోయాయి. ఈ మహిళలు తమ బిడ్డలకు జన్మనిచ్చారా? ఆ శిశువులు బతికే ఉన్నారా లేక చనిపోయారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ గ్యాప్‌లో ఉన్న వేలాది కేసులు అక్రమంగా జరిగిన ఆడ భ్రూణహత్యలేనని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు.

కేవలం లక్ష్యాలను చేరుకోవడం కోసం క్షేత్రస్థాయి సిబ్బంది నకిలీ ప్రసూతి కార్డులు సృష్టించి ఉండవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు, స్కానింగ్ సెంటర్ల అక్రమ దందా, నకిలీ వైద్యుల హస్తం ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కాగితాల మీద లెక్కలు చూపించి, లోలోపల భ్రూణహత్యలకు పాల్పడుతున్నారా అనే కోణంలో కమిటీ విచారణ చేపట్టింది.

జిల్లా కలెక్టర్ హర్షల్ భోయార్ స్పందిస్తూ, రాష్ట్ర స్థాయి కమిటీ ఇప్పటికే జిల్లాలో పర్యటించి వివరాలు సేకరించిందని తెలిపారు. నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అబార్షన్లపై నిఘా ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఉదంతం కేవలం యాదగిరి జిల్లాకే పరిమితమా లేక రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందా అన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. విచారణ నివేదిక బయటకు వస్తే గానీ ఈ ‘నిశ్శబ్ద హత్యాకాండ’ వెనుక ఉన్న అసలు నిజా నిజాలు బయటపడవు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *