
మాంసాహారుల మొదటి ఛాయిస్ చికెన్. తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ లభిస్తుందని చాలామంది చికెన్‌ను అమితంగా ఇష్టపడతారు. అయితే కోడి మాంసం రుచిగా ఉంది కదా అని దానిలోని ప్రతి భాగాన్ని తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోడి శరీరంలోని కొన్ని భాగాలు వ్యర్థాలను వడపోసే పని చేస్తాయి కాబట్టి వాటిలో విష రసాయనాలు, ప్రమాదకర బ్యాక్టీరియా నిల్వ ఉండే అవకాశం ఉంది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గౌతమ్ చౌదరి అందించిన సమాచారం ప్రకారం.. చికెన్ తినేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
కోడి చర్మం: కొలెస్ట్రాల్‌కు కేరాఫ్ అడ్రస్
చాలామంది చికెన్ ఫ్రై లేదా రోస్ట్ చేసేటప్పుడు చర్మంతో కలిపి వండుతారు. ఇది రుచికరంగా ఉన్నప్పటికీ.. ఇందులో సంతృప్త కొవ్వు విపరీతంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చేలా చేస్తుంది. అందుకే స్కిన్ లెస్ చికెన్ ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ఊపిరితిత్తులు: వేడిని తట్టుకునే బ్యాక్టీరియా
కోడి ఊపిరితిత్తులలో అనేక రకాల హానికర బ్యాక్టీరియా నివసిస్తాయి. విచిత్రమేమిటంటే.. మాంసాన్ని ఎంత అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించినా వీటిలోని కొన్ని రకాల బ్యాక్టీరియా చనిపోవు. ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.
లివర్ – కిడ్నీ
కోళ్ల పెంపకంలో త్వరగా పెరగడానికి, వ్యాధులు రాకుండా ఉండటానికి వీటికి యాంటీబయాటిక్స్ ఇస్తారు. కోడి శరీరంలోని వ్యర్థాలను వడపోసే కాలేయం, మూత్రపిండాలలో ఈ మందుల అవశేషాలు ఎక్కువగా పేరుకుపోతాయి. వీటిని తరచుగా తినడం వల్ల మనుషులలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏర్పడి భవిష్యత్తులో మనకు మందులు పనిచేయని స్థితి రావచ్చు.
తల, మెడ భాగాలు
కోళ్లకు ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్ల ప్రభావం వాటి తల భాగంలో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక మెడ భాగంలో ఉండే శోషరస కణుపులు వైరస్‌లు, బ్యాక్టీరియాకు ప్రధాన ఆశ్రయాలు. వీటిని తినడం వల్ల మన రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది.
కాళ్లు, పేగులు
కోడి కాళ్లు ఎప్పుడూ నేలపై మలమూత్రాల మధ్య తిరుగుతుంటాయి కాబట్టి ఎంత శుభ్రం చేసినా ఇన్ఫెక్షన్ ముప్పు ఉంటుంది. ఇక పేగులు ఎల్లప్పుడూ వ్యర్థాలు, పరాన్నజీవులతో నిండి ఉంటాయి కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది.
వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రక్తనాళాలు: మాంసంలో రక్తం లేదా రక్తనాళాలు లేకుండా చూసుకోవాలి. పచ్చి రక్తంలో ఉండే బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది.
శుభ్రత: చికెన్ తెచ్చిన తర్వాత ఉప్పు, పసుపుతో కడిగితే పైన ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది.
ఉడికించడం: చికెన్ సరిగ్గా ఉడకకపోతే దానిలోని సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ప్రాణాంతకంగా మారుతుంది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం వివిధ ఆరోగ్య నివేదికల ఆధారంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి శరీరతత్వం వేర్వేరుగా ఉంటుంది.. కాబట్టి ఏదైనా కొత్త డైట్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.)