విషాన్ని దొంగిలించే విచిత్ర పాము.. దీన్ని మెడ వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..?

విషాన్ని దొంగిలించే విచిత్ర పాము.. దీన్ని మెడ వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..?


సాధారణంగా పాము అంటేనే విషం.. కానీ ప్రకృతిలో ఒక విచిత్రమైన పాము ఉంది. దీనికి జన్యుపరంగా విషాన్ని ఉత్పత్తి చేసే శక్తి లేదు. అయినప్పటికీ ఇది అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాముగా చలామణి అవుతోంది. అదే రెడ్ నెక్డ్ కీల్‌బ్యాక్. తాను తినే ఆహారం నుంచే విషాన్ని అరువు తెచ్చుకుని, తన ప్రాణాలను కాపాడుకునే ఈ పాము జీవనశైలి శాస్త్రవేత్తలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 కప్పల నుంచి విషం సేకరణ

ఈ పాము ప్రధానంగా విషపూరితమైన కప్పలను వేటాడి తింటుంది. సాధారణంగా ఆ కప్పల విషం ఇతర జీవులకు ప్రాణసంకటంగా మారుతుంది. కానీ ఈ కీల్‌బ్యాక్ పాము శరీరం ఆ విషాన్ని తట్టుకోవడమే కాకుండా దానిని తన అవసరానికి వాడుకుంటుంది. విషపూరిత కప్పల చర్మంపై ఉండే ఈ రసాయనాలను పాము జీర్ణించుకోకుండా, తన రక్తప్రవాహం ద్వారా మెడ భాగంలోని ప్రత్యేక గ్రంథులకు చేరవేస్తుంది. పాము మెడ వెనుక ఉండే ఈ గ్రంథులే విషానికి స్టోరేజ్ పాయింట్లు. శత్రువు దాడి చేసినప్పుడు ఈ గ్రంథుల నుంచి విషాన్ని చిమ్మి తనను తాను రక్షించుకుంటుంది.

విషం ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా..

శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఈ పాములకు తమ శరీరంలో ఎంత విషం ఉందో ముందే తెలుస్తుందని సమాచారం. ఒకవేళ పాము తిన్న ఆహారంలో విషం ఎక్కువగా ఉంటే, అది శత్రువుల ముందు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. తన మెడను పైకి ఎత్తి గ్రంథులను ప్రదర్శిస్తూ ఎదుటి జీవిని భయపెడుతుంది. ఒకవేళ అది తిన్న ఆహారంలో విషం లేకపోతే లేదా గ్రంథులు ఖాళీగా ఉంటే, అది పోరాటానికి దిగకుండా చాలా నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు

జపాన్‌లోని నాగోయా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఒక అద్భుతమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పాములు తమ ప్రవర్తనను కేవలం అవకాశవాదం లాగా కాకుండా, తమ రక్షణ సామర్థ్యాన్ని బట్టి మార్చుకుంటాయని తేలింది. తమ మెడలోని విషం అయిపోయినప్పుడు కూడా శత్రువులను తప్పుదోవ పట్టించడానికి ఇవి బ్లఫ్ చేస్తాయని కూడా కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిని సీక్వెస్టరింగ్ జీవులుగా పిలుస్తారు. అంటే ఇతరుల నుంచి రసాయనాలను సేకరించి దాచుకునే అరుదైన గుణం వీటికి ఉంది.

జీవవైవిధ్యంలో మనుగడ సాగించడానికి ప్రకృతి ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇస్తుంది. రెడ్ నెక్డ్ కీల్‌బ్యాక్ పాము విషయంలో అది ‘అరువు తెచ్చుకున్న విషం. తన ఆహారాన్నే ఆయుధంగా మార్చుకున్న ఈ పాము కథ, ప్రకృతిలోని వింతలకు ఒక నిలువెత్తు నిదర్శనం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *