ఏపీఎస్ఆర్టీసీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు డీజిల్‌పై నడుస్తున్న బస్సులను ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తోంది. దీనివల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్ ఇంద్ర ఏసీ పేరుతో సిద్ధమైన ఈ బస్సులు పూర్తిగా ఆధునిక సౌకర్యాలతో రూపొందించబడ్డాయి. బయటకు సాధారణ బస్సుల్లా కనిపించినా, లోపల మాత్రం పూర్తిగా నూతన టెక్నాలజీతో పనిచేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ప్రయాణికులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.
డీజిల్ బస్సులతో పోలిస్తే వీటిలో శబ్దం చాలా తక్కువగా వస్తుంది. దీంతో ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. వృద్ధులు, పిల్లలకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ బస్సుల్లో ఏసీ సదుపాయం కూడా మెరుగ్గా ఉండటంతో సమ్మర్‌లోనూ కూల్‌గా ప్రయాణించవచ్చు. అంతే కాదు ఇది ఎలక్ట్రిక్ కావడంతో పొగ వంటి కాలుష్యం ఉండదు. ఆరోగ్యానికి కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ బస్సుల్లో హై కెపాసిటీ బ్యాటరీలను అమర్చడం వల్ల ఇవి ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలిగేలా రూపొందించారు.
అంతే కాదు దీనికి ఉండే హెవీ బ్యాటరీలు సైతం చాలా వేగంగా ఛార్జ్ అయ్యే సదుపాయం ఉంది. బస్సుల భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ సిస్టమ్స్, ఆటోమేటిక్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే సిద్ధమైన ఈ బస్సులను ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా పరీక్షించారు. బ్యాటరీ పనితీరు, బ్రేకింగ్ సిస్టమ్, ఛార్జింగ్ సామర్థ్యం వంటి అంశాలను సమీక్షించారు. అన్ని పరీక్షల్లో ఈ బస్సులు సక్సెస్ అయ్యాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ట్రయల్ రన్‌గా కొన్ని బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. ముఖ్యంగా నగరాలు, దీర్ఘదూర మార్గాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.అతి త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీ ఎండి బాల సుబ్రమణ్యం ఈ గ్రీన్ ఇంద్ర ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ, ప్రయాణికులకు మెరుగైన అనుభవం అందించే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.