ఈ వేసవి కాలంలో చాలా మంది ఇష్టంగా తినే పండ్లలో మామిడి ముందుంటుంది. అయితే, మామిడి పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా అనే సందేహం చాలా మందిలో, ముఖ్యంగా మధుమేహ రోగుల్లో, తరచుగా కనిపిస్తుంది. నిజంగా మామిడి పండు డయాబెటిస్ ఉన్నవారికి హానికరమా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) సుమారు 51 నుంచి 60 మధ్య ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెరను ఒక్కసారిగా పెంచే పండు కాదు. అయినప్పటికీ, మితిమీరిన పరిమాణంలో తింటే చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిమితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.
షుగర్ ఉన్నవారు ఎంత తీసుకోవాలి?
సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ దీపక్ కుమార్ సుమన్ ప్రకారం.. మామిడి పండ్లలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ, వాటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే రోజుకు ఒక మామిడి పండు లేదా చిన్న పరిమాణం సరిపోతుందని సూచిస్తున్నారు.
ఎలా తీసుకోవాలి.?
మధుమేహ రోగులు మామిడి పండ్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఒకేసారి 100 గ్రాములకు మించి తినకూడదు. ఉదయం ఖాళీ కడుపుతో మామిడి తినడం మంచిది కాదు. మామిడి షేక్‌లను తప్పించడం మంచిది, ఎందుకంటే అవి అదనపు చక్కెరను పెంచుతాయి. మరింతగా, మామిడి పండును పీచు ఎక్కువగా ఉండే ఇతర పండ్లు లేదా నట్స్‌తో కలిపి తినడం మంచిది. నట్స్‌లో ఉండే ప్రోటీన్, మంచి కొవ్వులు చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయి.
మొత్తానికి, మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ, మధుమేహ రోగులు వాటిని మితంగా, సరైన విధానంలో తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.