డబ్బులు కట్టి మరీ జైలుకు క్యూ కడుతున్న జనం.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు..

డబ్బులు కట్టి మరీ జైలుకు క్యూ కడుతున్న జనం.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు..


సాధారణంగా జైలు అంటేనే అందరూ భయపడతారు. కానీ చైనాలో మాత్రం వందలాది మంది యువతీ యువకులు క్యూ కట్టి మరీ జైలుకు వెళ్తున్నారు. అది కూడా వేల రూపాయల ఫీజు చెల్లించి మరీ అక్కడ ఖైదీలుగా మారుతున్నారు. అయితే ఇది నేరస్థుల కోసం కట్టిన జైలు కాదు.. కేవలం బరువు తగ్గాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యాట్ జైల్. ఈ ప్రత్యేక బరువు తగ్గించే క్యాంప్స్ ఇప్పుడు చైనాలో హాట్ టాపిక్‌గా మారాయి. వీటి నిర్మాణం చూస్తే అచ్చం కారాగారాన్ని తలపిస్తుంది. ఎత్తైన గోడలు, భారీ గేట్లు, నిరంతర సీసీ కెమెరాల నిఘా మధ్య ఈ శిబిరాలు నడుస్తాయి. ఒకసారి లోపలికి వెళ్లారంటే, నిర్దేశించిన గడువు ముగిసే వరకు బయటకు వచ్చే ప్రసక్తే లేదు.

28 రోజుల కఠిన శిక్ష

ఈ క్యాంపులో చేరిన వారికి 28 రోజుల పాటు కఠినమైన షెడ్యూల్ ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే నాలుగు గంటల పాటు కఠినమైన శారీరక శ్రమ చేయాలి. ఏరోబిక్స్, హై-ఇంటెన్సిటీ వర్కౌట్స్ వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. బయటి ఆహారంపై పూర్తి నిషేధం. శిబిరంలో ఇచ్చే పరిమిత ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉడికించిన మాంసం, పచ్చి కూరగాయలు, తక్కువ కేలరీలు ఉండే భోజనం మాత్రమే అందిస్తారు. ప్రతిరోజూ బరువును తనిఖీ చేస్తారు. ఎవరైనా బద్దకించినా లేదా నియమాలు ఉల్లంఘించినా కఠినమైన హెచ్చరికలు ఉంటాయి.

లక్షల్లో ఖర్చు.. వేగంగా ఫలితం

ప్రముఖ ఇన్‌స్టాగ్రామర్ టి.ఎల్. హువాంగ్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ఈ 28 రోజుల శిక్ష కోసం తాను దాదాపు రూ.89,000 ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ కాలంలో ఆయన బయటి ప్రపంచానికి దూరంగా కేవలం ఫిట్‌నెస్ మీద మాత్రమే దృష్టి పెట్టారు. క్రమశిక్షణ లేని జీవనశైలి అలవాటైన వారికి ఇదొక అద్భుతమైన పరిష్కారమని కొందరు అంటుంటే ఇది మానసికంగా చాలా ఒత్తిడితో కూడుకున్న పని అని మరికొందరు విమర్శిస్తున్నారు.

వివాదాలు – విమర్శలు

చైనాలో పెరుగుతున్న ఊబకాయం సమస్యను ఈ క్యాంపులు క్యాష్ చేసుకుంటున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కేవలం కొద్ది రోజుల్లోనే విపరీతంగా బరువు తగ్గడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా.. స్వేచ్ఛను వదులుకొని.. స్లిమ్‌గా మారదాం అనుకునే వారికి మాత్రం ఈ ఫ్యాట్ జైల్స్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *