మీరు ఉద్యోగం చేస్తుంటే గ్రాట్యుటీ గురించి వినే ఉంటారు. మీరు ఉద్యోగం మానేసి వెళ్లేటప్పుడు దీనిని మీకు చెల్లిస్తారు. మీరు శాశ్వత ఉద్యోగులు అయితే ఒక కంపెనీలో ఐదేళ్ల పాటు పనిచేస్తే మీకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. ఐదేళ్ల కంటే ముందే మీరు ఉద్యోగం మానేస్తే గ్రాట్యుటీ చెల్లించరు. అయితే ఫిక్స్‌డ్ టర్మ్స్‌లో ఒప్పంద ప్రాతిపాదికన పని చేస్తుంటే ఒక ఏడాది పనిచేసినా గ్రాట్యుటీ చెల్లించాలని ఇటీవల కొత్త లేబర్ కోడ్‌లలో కేంద్రం పొందుపర్చింది. ఇక ఉద్యోగి మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందినా సర్వీస్ పీరియడ్‌తో సంబంధం లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలి. ఉద్యోగి సేవకు గుర్తింపుగా కంపెనీలు ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లిస్తూ ఉంటాయి. అయితే గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు..? ఎన్నేళ్ల సర్వీసుకు ఎంత వస్తుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ చట్టం ప్రకారం ఒక సంస్థలో 10 లేదా అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తుంటే ఇది వర్తిస్తుంది. కాంట్రాక్ట్, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. ఒక ఉద్యోగి ఐదేళ్ల పాటు విరామం లేకుండా ఒక కంపెనీలో పనిచేస్తే గ్రాట్యూటీకి అర్హులు. ఉద్యోగి పొందిన చివరి జీతం, ఉద్యోగి సర్వీస్ సంవత్సరాల ఆధారంగా గ్రాట్యుటీ లెక్కిస్తారు. ఒక నెలలో సాధారణంగా 26 వర్కింగ్ డేస్ ఉంటాయి. 15 రోజుల జీతం ఆధారంగా ఈ లెక్కింపు జరుపుతారు. ఉదాహరణకు ఉద్యోగి చివరి జీతం రూ.50 వేలు అనుకుందాం. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేశారని అనుకుంటే.. 50x10x(15/26) ప్రకారం లెక్కిస్తారు. అంటే ఉద్యోగికి మొత్తం రూ.2,88,461 గ్రాట్యూటి చివరిలో అందుతుంది.
20 సంవత్సరాలు పనిచేస్తే..
ఇక ఉద్యోగి 20 సంవత్సరాలు పనిచేస్తే ఎంత వస్తుందనేది చూద్దాం. చివరి నెలలో రూ.60 వేల జీతం వచ్చిందనుకుందాం. 60000x20x(15/26) లెక్కన గణిస్తారు. అంటే ఉద్యోగికి రూ.6,92,307 అందుతుంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి చివరి జీతం రూ.70 వేలు పొందితే.. 70,000 x 30 x (15/26) ప్రకారం లెక్కి్స్తారు. అంటే ఉద్యోగికి కంపెనీ రూ.1,211,528 చెల్లించాల్సి ఉంటుంది. 1972 గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం ప్రకారం ప్రైవేట్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గరిష్ట తప్పనిసరి గ్రాట్యుటీ రూ.20 లక్షలుగా ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25 లక్షలుగా ఉంది. ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగులందరికీ గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది. ఉద్యోగం మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందినా కుటుంబానికి గ్రాట్యుటీ అందిస్తారు. ప్రావిడెంట్ ఫండ్ తరహాలో ఉద్యోగికి సంక్షేమ పథకంగా ఇది ఉపయోగపడుతుంది. ఉద్యోగం మానేసినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంతో సొమ్ము అందుతుంది.