ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న అద్భుతమైన రహస్యం ఇదే!

ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న అద్భుతమైన రహస్యం ఇదే!


హిందూ సంప్రదాయంలో ప్రతి ఆలయంలో మూలదైవానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉండటం సాధారణంగా కనిపిస్తుంది. భక్తులు దర్శనానికి వెళ్లినప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణ చేసి తరువాతే గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. దీనికి వెనుక ఒక పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. మహాభారత కాలంలో ధర్మరాజు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయిస్తాడు. యాగాశ్వం దేశాలు తిరుగుతూ మణిపుర రాజ్యానికి చేరుతుంది. ఆ రాజ్యాధిపతి మయూరధ్వజుడు మహా దాత, ధర్మనిష్ఠుడు. అతని కుమారుడు యాగాశ్వాన్ని ఆపడంతో పాండవులకు ఎదురుదెబ్బ తగులుతుంది.

మయూరధ్వజుడికి పరీక్ష

చివరకు శ్రీకృష్ణుడి సూచనతో ధర్మరాజు మయూరధ్వజుడి గొప్పదనాన్ని పరీక్షించేందుకు వృద్ధ బ్రాహ్మణుల వేషంలో అక్కడికి వెళ్తాడు. ఆ వేషంలో వారు ఒక విచిత్రమైన కోరికను వ్యక్తం చేస్తారు. ఒక సింహం చేతిలో చిక్కుకున్న బాలుడిని విడిపించాలంటే.. మయూరధ్వజుడు తన శరీరాన్ని అర్ధభాగంగా దానం చేయాలని చెప్పబడుతుంది. ధర్మనిష్ఠుడైన మయూరధ్వజుడు తన కుటుంబంతో కలిసి ఆ త్యాగానికి కూడా సిద్ధపడతాడు. అతని అపార దానశీలతను చూసి ధర్మరాజు ఆశ్చర్యపోతాడు. ఆ సమయంలో మయూరధ్వజుడి కళ్లలో నుంచి వచ్చిన కన్నీటిని తప్పుగా అర్థం చేసుకున్న ధర్మరాజుకు.. అది బాధ కాదు.. దానం చేసే అవకాశం ఒక భాగానికి మాత్రమే దక్కిందన్న భావన అని మయూరధ్వజుడు వివరిస్తాడు.

మయూరధ్వజుడుకి శ్రీకృష్ణుడి వరం

మయూరధ్వజుడి త్యాగనిరతికి సంతృప్తి చెందిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి వరం కోరమంటాడు. అప్పుడు మయూరధ్వజుడు తన శరీరం నశించినా తన త్యాగభావం శాశ్వతంగా భక్తులకు స్ఫూర్తిగా ఉండాలని కోరుతాడు. ఆ వరం ప్రకారం శ్రీకృష్ణుడు అతని ఆత్మ ఆలయాల ముందు ధ్వజస్తంభంగా స్థిరంగా నిలిచి భక్తులకు మార్గదర్శకంగా ఉండేలా అనుగ్రహిస్తాడు. అప్పటి నుంచి ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించి, దాన్ని ముందుగా దర్శించి నమస్కరించిన తరువాతే మూలదైవ దర్శనం చేయడం సంప్రదాయంగా మారింది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *