ఏంటీ.. సర్వీసింగ్‌ చేయించినా ఏసీ కూలింగ్‌ రావట్లేదా? అయితే ఇలా చేయండి!

ఏంటీ.. సర్వీసింగ్‌ చేయించినా ఏసీ కూలింగ్‌ రావట్లేదా? అయితే ఇలా చేయండి!


వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఎయిర్ కండిషనర్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. చాలా మంది ముందుగానే ఏసీ సర్వీసింగ్ చేయించుకున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో సరైన కూలింగ్ రాదు. దీని వెనుక పలు సాంకేతిక కారణాలు ఉంటాయి. అందులో ప్రధాన కారణం గ్యాస్ లీకేజ్. సర్వీసింగ్ తర్వాత కూడా కూలింగ్ రాకపోతే, ఎక్కువగా రిఫ్రిజెరెంట్ గ్యాస్ తగ్గిపోవడమే కారణమవుతుంది. పైపుల్లో చిన్న లీక్ ఉన్నా గ్యాస్ క్రమంగా తగ్గిపోతుంది. దీంతో ఏసీ కేవలం ఫ్యాన్‌లా గాలి ఊదుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టెక్నీషియన్‌తో గ్యాస్ ప్రెజర్ చెక్ చేయించి, లీక్ ఉన్న ప్రదేశాన్ని సరిచేసి గ్యాస్ రీఫిల్ చేయించాలి.

ఇంకో ముఖ్యమైన కారణం కాయిల్స్‌లో దుమ్ము పేరుకుపోవడం. చాలా సందర్భాల్లో సర్వీసింగ్ సమయంలో కేవలం బయట భాగమే శుభ్రం చేస్తారు. కానీ ఇండోర్ యూనిట్‌లోని ఎవాపరేటర్ కాయిల్స్, అవుట్‌డోర్ యూనిట్‌లోని కండెన్సర్ కాయిల్స్ మధ్యలో మురికి ఉండిపోతే, వేడి గాలిని సరిగా బయటకు పంపలేకపోతుంది. దీనివల్ల కూలింగ్ సామర్థ్యం తగ్గుతుంది. దీన్ని నివారించేందుకు డీప్ క్లీనింగ్ చేయించడం అవసరం. అదేవిధంగా థర్మోస్టాట్ సెట్టింగ్స్ కూడా కీలకం. రిమోట్‌లో పొరపాటున ఫ్యాన్ మోడ్ లేదా డ్రై మోడ్ ఆన్ చేస్తే కూలింగ్ రాదు. అలాగే థర్మోస్టాట్ సెన్సార్ సరిగా పనిచేయకపోతే కంప్రెసర్ ఆన్ కాకపోవచ్చు. కాబట్టి ‘కూల్ మోడ్’లో ఉందో లేదో చూసి, ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద సెట్ చేయాలి.

కంప్రెసర్ సమస్యలు కూడా కూలింగ్‌పై ప్రభావం చూపుతాయి. కంప్రెసర్ పనిచేయకపోతే లేదా పదేపదే ట్రిప్ అయితే ఏసీ చల్లదనం ఇవ్వదు. అవుట్‌డోర్ యూనిట్ నుంచి అసాధారణ శబ్దాలు వస్తే వెంటనే నిపుణులను సంప్రదించడం మంచిది. ఇక కొన్ని సాధారణ కారణాలను కూడా నిర్లక్ష్యం చేయరాదు. గదిలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం లేదా గది పరిమాణానికి తక్కువ కెపాసిటీ ఉన్న ఏసీ వాడడం వల్ల కూడా కూలింగ్ తగ్గుతుంది. కాబట్టి సమస్యను గుర్తించి సరైన పరిష్కారం తీసుకుంటేనే ఏసీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *