తెలంగాణలో టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు ఏప్రిల్ 21వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో నేటి అర్థరాత్రి నుంచే బస్సులు నిలిచిపోతున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 22 ఉదయం షిప్ట్ నుంచే కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా బస్సులు ఆపేయనున్నారని తెలుస్తోంది. బస్సు సర్వీసులు నిలిచిపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది. ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగనుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు చేపట్టేందుకు సిద్దమవుతోంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు ఆగిపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశముంది. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలగనుంది. దీంతో సమ్మెను విరమింపచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ఆర్టీసీ జేఏసీ నేతలు వెనక్కి తగ్గడం లేదు.
సమ్మె తప్పడం లేదు
రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ప్రజలు రోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా 35 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. దీంతో కార్మికులు సమ్మెకు దిగితే మహిళలతో పాటు ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశముంది. దాదాపు 10 వేల బస్సులను డిపోల్లోనే నిలిపివేసి కార్మికులు విధులను బహిష్కరించనున్నారు. దీంతో ప్రభుత్వం బస్సులు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే జేఏసీ నేతలతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్డీసీ ఎండీ చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మె తప్పడం లేదని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం నుంచే బస్సులను నిలిపివేస్తామని ప్రకటించారు.
బస్సులు ఆగనివ్వం
అయితే ఆర్టీసీ జేఏసీ సమ్మెపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగనివ్వబోమని ప్రకటించారు. ఆర్టీసీ అనేది పేద ప్రజల లైఫ్‌లైన్ అని, బస్సుల ఆగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, కార్మికలు మెజార్టీ డిమాండ్లను నెరవేర్చుతామని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెన్నై పర్యటన నుంచి వచ్చాక జేఏసీ నేతలతో మరోసారి చర్చలు జరుపుతామని, సమ్మె విరమింపచేసేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. యూనియన్ల పునరుద్దరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. రెండో వేతన సవరణతో పాటు విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లింపు, కార్మిక సంఘాలను పునరుద్ధరించడం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది..
ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.. pic.twitter.com/vrKjVDJDwm
— TGSRTC (@TGSRTCHQ) April 21, 2026