శ్రీవారి సన్నిధిలో భక్తులు తమ కోర్కెలు తీరినందుకు నిలువు దోపిడీ (మొక్కు) ఇవ్వడం ఆచారం. కానీ ఇప్పుడు కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు విమాన మెట్లెక్కకముందే దారి దోపిడీకి గురవుతున్నారు. హైదరాబాద్ – తిరుపతి మధ్య విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అడ్డగోలు చార్జీలు సామాన్య భక్తుడి నడ్డి విరుస్తున్నాయి. విమాన ప్రయాణం సామాన్యుడికి కలగా మారుతున్న వేళ.. తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రికి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
దూరం తక్కువ.. చార్జీలు ఎక్కువ
హైదరాబాద్ నుండి తిరుపతికి ఉన్న దూరం కేవలం 500 కిలోమీటర్లు. కానీ టికెట్ ధర మాత్రం రూ.12 వేల నుండి రూ.15 వేల వరకు పలుకుతోంది. హైదరాబాద్ నుండి 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి లేదా బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలకు వెళ్లే చార్జీల కంటే తిరుపతికే విమాన ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక మధ్యతరగతి కుటుంబం శ్రీవారిని దర్శించుకోవాలంటే కేవలం విమాన ప్రయాణానికే లక్ష రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది.
ఉడాన్ లక్ష్యం ఏమైంది?
సామాన్యుడు కూడా విమానం ఎక్కాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన UDAN పథకం ఆశయాలు తిరుపతి మార్గంలో నీరుగారిపోతున్నాయని ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 మధ్య కాలంలో దాదాపు 11.84 లక్షల మంది ప్రయాణికులు తిరుపతికి విమానాల్లో రాకపోకలు సాగించారు. కేవలం 2026 మార్చి నెలలోనే 88,405 మంది భక్తులు విమానాల ద్వారా వచ్చారు. ఇంత రద్దీ ఉన్నా విమాన సంస్థలు మాత్రం చిన్న విమానాలను నడుపుతూ కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు.
కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ: డిమాండ్లు ఇవే..
ఏపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ గురుమూర్తి రాసిన లేఖలో ప్రధానంగా పలు అంశాలను ప్రస్తావించారు.
- ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఎక్కువ సీట్లు ఉండే విమానాలను నడపాలి.
- ఎయిర్ చార్జీలను తక్షణమే సమీక్షించి, సాధారణ ధరలకు తీసుకురావాలి.
- దూరంతో సంబంధం లేకుండా విమానయాన సంస్థలు చేస్తున్న ఈ దోపిడీ వల్ల భక్తులపై ఆర్థిక భారం పడుతోందని వాపోయారు.
స్వామివారికి కానుకలు ఇచ్చుకోవాలనుకుంటాం కానీ, ఇలా విమాన సంస్థలకు దోచిపెట్టాల్సి వస్తుందని అనుకోలేదు అని ఓ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. విమానయాన సంస్థల ఈ ధరల ధగాపై కేంద్ర మంత్రి ఎలా స్పందిస్తారో, భక్తులకు ఈ ఆర్థిక భారం నుండి ఉపశమనం ఎప్పుడు కలుగుతుందో వేచి చూడాలి.