Palnadu: భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని బ్రదర్…

Palnadu: భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని బ్రదర్…


పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురైన భర్త.. తన ఇద్దరు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగించి, తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గంగుపల్లి తండాకు చెందిన చిన్నా నాయక్‌కు అదే గ్రామానికి చెందిన బుజ్జి భాయ్‌తో దాదాపు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో… బుజ్జి భాయ్ పుట్టింటికి వెళ్లిపోయి, తిరిగి కాపురానికి రావడం లేదని తెలిపింది. భార్యను తిరిగి తీసుకురావడానికి చిన్నా నాయక్ పెద్దలతో కలిసి పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితిలో పిల్లలు తల్లిని గురించి తరచూ అడుగుతుండటంతో అతను మరింత మనోవేదనకు గురయ్యాడు. తాను ఒక్కడే చనిపోతే పిల్లలు అనాథలవుతారనే భావనతో.. వారితో పాటు తానూ ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో పిల్లలకు కూల్‌డ్రింక్ తీసుకువచ్చి అందులో పురుగుమందు కలిపి తాగించాడు. అనంతరం తానూ అదే మందు సేవించాడు. స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బుజ్జి భాయ్ వెంటనే ఇంటికి చేరుకుని కూతురిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. మరోవైపు చిన్నా నాయక్, అతని కుమారుడిని బంధువులు మొదట నరసరావుపేట ఆసుపత్రికి తరలించి… అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు మార్చారు.

ప్రస్తుతం ముగ్గురు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వచ్చే 48 గంటలు కీలకమని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: ప్రిన్సిపాల్ సార్ జోరు చూసి బిత్తరపోయిన స్టూడెంట్స్.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *