Rain Alert: ‘ఉక్క’రిబిక్కిరికి బిగ్‌ రిలీఫ్‌.. వారం పాటు చిరుజల్లుల పలకరింపులు!

Rain Alert: ‘ఉక్క’రిబిక్కిరికి బిగ్‌ రిలీఫ్‌.. వారం పాటు చిరుజల్లుల పలకరింపులు!


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం వేళల్లో భానుడు భగభగమంటున్నాడు. శనివారం చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ మండలం బుట్టాపూర్‌లో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్‌ టౌన్‌లో 44.4 డిగ్రీలు, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 44.4 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం సూచించింది. ఎండ వేడిమికి తాళలేక పలు జిల్లాల్లో నలుగురు మృతిచెందారు. అయితే శనివారం సాయంత్రానికి వాతావరణం కాస్త చల్లబడింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏప్రిల్ 26వ వరకు వానలు

తెలంగాణలో శనివారం ఉదయం ఎండలు ఠారెత్తించాయి. సాయంత్రానికి వానలు కురిశాయి. ఉపరితల అవర్తనం, ద్రోణి, క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. ఇక ఏప్రిల్ 26వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే గరిష్ట ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదని తెలిపింది. దీంతో ఉదయం ఎండలు అలాగే కొనసాగుతాయి. సాయంత్రం మాత్రం వానలతో ఉపశమనం లభించనుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ రోజు ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఏపీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌లోనే అక్కడ పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కు దాటింది. రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత పెరిగింది. కడపలో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *