ఇటీవలి కాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న పేరు అడ్వకేట్ సుబ్బారావు. ఒక సాధారణ న్యాయవాది పేరు ఎలా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది? ఆ కథలో మలుపులు ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. వివాదాలు, ఆరోపణలు, ప్రచారం అన్నీ కలిసిన ఒక సినిమా రేంజ్ కథ కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన సుబ్బారావు వృత్తిరీత్యా న్యాయవాది. అయితే న్యాయవాద వృత్తితో పాటు సినిమాలపై కూడా అతనికి ఆసక్తి ఉంది. కొన్ని ప్రముఖ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే సుబ్బారావు పేరు ప్రధానంగా వెలుగులోకి వచ్చినది మైక్రో ఫైనాన్స్ వివాదంతో. పలువురు బాధితుల తరఫున ఆయన ఫిర్యాదు చేయడంతో ప్రముఖ గాయని మంగ్లీ పేరు ఈ కేసులోకి రావడం కలకలం రేపింది. సుమారు రూ.10 కోట్లకు పైగా పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఆరోపిస్తూ.. ఈ వ్యవహారాన్ని పోలీసుల ముందుకు తీసుకువచ్చాడు. బాధితులు కూడా మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలను వెల్లడించడంతో కేసు మరింత చర్చనీయాంశమైంది.
ఈ వివాదం మధ్యలో మరో మలుపు చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించగా మద్యం శాతం నమోదైనట్లు వెలుగులోకి రావడం.. ఈ కేసును మరో కోణంలోకి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన సుబ్బారావు.. తనను బెదిరించడానికి, కేసును బలహీనపరచడానికి ఇది ప్రయత్నమని ఆరోపించాడు. అదే సమయంలో పోలీసుల చర్యలపై కోర్టును కూడా ఆశ్రయించడం ఈ ఘటనను మరింత హైలెట్ చేసింది.
మరోవైపు గాయని మంగ్లీ కూడా సుబ్బారావుపై గట్టిగానే కౌంటర్ ఎటాక్ షురూ చేసింది. అతను తనను డబ్బులు డిమాండ్ చేసి వేధిస్తున్నారని, తప్పుడు ఆరోపణలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం పరస్పర ఆరోపణల దిశగా మళ్లింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిజంగా పెట్టుబడిదారులు మోసపోయారా? లేక సెలబ్రిటీ పేరును ఉపయోగించి వివాదాన్ని సృష్టిస్తున్నారా? అన్న కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. ఏది ఏమైతేనేం.. ఈ కేసులో సుబ్బారావుకు కావాల్సినంత కవరేజ్ దక్కింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన హుషారుగా దూసుకుపోతున్నారు.
మొత్తానికి.. అడ్వకేట్ సుబ్బారావు కథ ఒక సాధారణ కేసు కాదనే విషయం స్పష్టమవుతోంది. న్యాయ పోరాటం, వ్యక్తిగత ఆరోపణలు, ప్రచారం.. ఇవన్నీ కలిసి ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read: AC కొంటున్నారా.. జాగ్రత్త.. ఇంతకంటే బెస్ట్ టిప్స్ మార్కెట్‌లో ఎవ్వరూ ఇవ్వలేరు..