బ్రహ్మకమలం, హిందూ పురాణాలలో దైవత్వం, స్వచ్ఛత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఒక పవిత్రమైన పుష్పంగా పరిగణించబడుతుంది. దీనిని హిమాలయాల రాజు అని కూడా పిలుస్తారు. అయితే బ్రహ్మకమలం మొక్క అద్భుతమైన రీతిలో పుష్పించడానికి పాటించాల్సిన సంరక్షణ పద్ధతులు, ప్రత్యేక ఎరువుల వాడకాన్ని ఈ కథనంలో అందిస్తున్నాం. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో కూడా పుష్కలంగా బ్రహ్మకమలం పూలను చూడవచ్చు.
బ్రహ్మకమలం అనేది కాక్టస్ జాతికి చెందిన మొక్క కాబట్టి, మట్టి ఎప్పుడూ లూజ్‌గా, పొడిపొడిగా ఉండాలి. సులువుగా నీరు ఇంకిపోయేలా మట్టిలో కనీసం 10% ఇసుకను కలపడం అవసరం. పెద్ద కంటైనర్‌ల అవసరం లేకపోయినా, సరైన మట్టి మిశ్రమం కీలకం. సూర్యరశ్మి విషయంలో, బ్రహ్మకమలం పూర్తి ఎండను తట్టుకోలేదు, ముఖ్యంగా వేసవిలో. ఉదయం 2-3 గంటలు మాత్రమే ఎండ తగిలే పాక్షిక నీడ ప్రాంతం అనుకూలం. మొక్క పెరిగే కొద్దీ బలంగా నిలబడటానికి సపోర్ట్ (ఆధారం) తప్పనిసరి. కర్ర లేదా పిల్లర్‌కు కట్టి మొక్కను పైకి పెంచాలి. ఒకసారి నాటిన తర్వాత, బ్రహ్మకమలం మొక్కను తరలించకపోవడమే మంచిది, ఎందుకంటే దాని ఆకులు సున్నితంగా ఉంటాయి. వేరే ప్రాంతానికి తీసుకెళ్లేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంది. పుష్కలంగా పూలు పూయడానికి, ఒక ప్రత్యేకమైన ద్రవ ఎరువును ఉపయోగించవచ్చు. దీని తయారీకి కావలసినవి: బాగా ఎండిన ఆవు పేడ (లేదా ఆవు పిడకలు/ఘనజీవామృతం), ఎండిన అరటి తొక్కలు (పొటాషియం కోసం), పసుపు (సహజ క్రిమిసంహారిణి). ఈ మూడు పదార్థాలను కలిపి 24 నుంచి 48 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత, వచ్చిన ద్రవాన్ని వడపోసి, మూడు వంతుల నీటిని కలిపి పలుచన చేయాలి. ఈ ద్రవ ఎరువును ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి మొక్కకు ఇవ్వాలి. ఈ ఎరువు వాడితే మొక్క గతంలో కంటే పక్కాగా ఎక్కువ పూలు పూస్తుంది. మిగిలిపోయిన పదార్థాలను మళ్ళీ నీటిలో నానబెట్టి, రెండు లేదా మూడు సార్లు ఉపయోగించవచ్చు. లిక్విడ్ రూపంలో కాకుండా, ఆవు పేడ, బనానా పీల్ పౌడర్, పసుపు కలిపి పొడి రూపంలో కూడా నేరుగా మట్టిలో వేయవచ్చు. బ్రహ్మకమలం ఇంటికి ఆనందం, అదృష్టం, శ్రేయస్సును తీసుకువస్తుందని, అలాగే దుష్టశక్తుల నుంచి రక్షిస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఈ మొక్కను ఇంటి తూర్పు వైపున పెంచడానికి ఇష్టపడతారు. ఈ చిట్కాలను పాటిస్తే, మీ బ్రహ్మకమలం మొక్క ఆరోగ్యంగా, బుషీగా పెరిగి, అందమైన పూలతో మీ ఇంటిని ప్రకాశవంతం చేస్తుంది.
Also Read: ‘తిన్నావా.. ఉన్నావా అని అడగడానికి కూడా రాలేదు.. తీసుకున్న డబ్బు ఇవ్వలేదు..’