బలమైన వృద్ధి ఉన్నా.. భారత్‌ 6వ ర్యాంక్‌కు ఎందుకు పడిపోయింది? కారణాలు ఇవేనా?

బలమైన వృద్ధి ఉన్నా.. భారత్‌ 6వ ర్యాంక్‌కు ఎందుకు పడిపోయింది? కారణాలు ఇవేనా?


IMF (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) విడుదల చేసిన 2026 ఏప్రిల్ ప్రపంచ ఆర్థిక దృక్పథ నివేదిక ప్రకారం నామమాత్రపు జీడీపీ పరంగా భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అమెరికా, చైనా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, జర్మనీ మూడో స్థానంలో ఉంది. జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్‌లు నాలుగో, ఐదో స్థానాల్లో ఉన్నాయి. సుమారు 4 ట్రిలియన్ డాలర్లకు పైగా జీడీపీతో భారత్ ఈ గ్రూప్‌కు కొద్దిగా దిగువన ఉంది. అయితే ఈ ర్యాంక్ మార్పు దేశ ఆర్థిక బలహీనతకు సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు.

జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె.విజయకుమార్ ప్రకారం.. రూపాయి విలువ క్షీణతే ప్రధాన కారణం. 2026 ఆర్థిక సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి సుమారు 11 శాతం పడిపోవడం వల్ల, జీడీపీ డాలర్లలో తగ్గినట్లు కనిపించింది. అదే సమయంలో జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్ బలపడటంతో ఆ దేశాలు భారత్‌ను అధిగమించాయి. ఇక ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ మనోరంజన్ శర్మ ఈ పరిణామాన్ని మూడు దెబ్బల ప్రభావంగా అభివర్ణించారు. కరెన్సీ మార్పులు, గణాంక సవరణలు, బాహ్య ఒత్తిళ్లు కలిసి ఈ పరిస్థితిని తీసుకువచ్చాయని ఆయన అన్నారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, కరెంట్ ఖాతా లోటు విస్తరించడం రూపాయిపై ఒత్తిడిని పెంచిందని వివరించారు.

ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్‌లు యూఎస్ డాలర్లలో లెక్కించబడటం వల్ల మారకపు రేట్ల మార్పులు దేశాల స్థానాలను తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయి. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం, భారత్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. దీంతో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యం మారలేదు. అయితే ఆ గమ్యాన్ని చేరుకునే సమయం కొద్దిగా ఆలస్యమై 2028–2030 మధ్యకు మారే అవకాశముందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *