చీకటిలో నిజం.. మనసులో భయం: లోక్‌సభలో రాహుల్ గాంధీ భావోద్వేగ ప్రసంగం

చీకటిలో నిజం.. మనసులో భయం: లోక్‌సభలో రాహుల్ గాంధీ భావోద్వేగ ప్రసంగం


లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘నారీ శక్తి వందన్’ సహా మూడు కీలక బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, తన వ్యక్తిగత జీవితంలోని జ్ఞాపకాలను రాజకీయ పాఠాలతో ముడిపెట్టి ఆసక్తికరంగా మాట్లాడారు.

రాహుల్ గాంధీ తన బాల్యంలోని ఒక భయాన్ని లోక్‌సభతో పంచుకున్నారు. “నేను చిన్నప్పుడు చీకటంటే చాలా భయపడేవాడిని. మా ఇంట్లో ఒక పెద్ద కుక్క ఉండేది, అది నన్ను, ప్రియాంకను భయపెట్టేది. రాత్రిపూట తోటలోకి వెళ్లాలంటే వణికిపోయేవాళ్లం,” అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తన నానమ్మ (ఇందిరా గాంధీ) తనకు నేర్పిన ఒక గొప్ప గుణపాఠాన్ని వివరించారు.

ఒకరోజు రాత్రి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో, నానమ్మ తనను తోటలోకి తీసుకెళ్లి బయట తాళం వేసిందని రాహుల్ చెప్పారు. “మూడు గంటల పాటు భయంతో కాళ్లు వణికిపోయాయి. అప్పుడు నానమ్మ నా దగ్గరకు వచ్చి.. ‘నువ్వు పాములకో, కుక్కలకో భయపడటం లేదు, నీ మనసులోని కల్పనలకు భయపడుతున్నావు. నిజం తరచుగా చీకటిలోనే ఉంటుంది, నువ్వు ఆ చీకటితో పోరాడటం నేర్చుకోవాలి’ అని చెప్పింది,” అని రాహుల్ పేర్కొన్నారు. ఇది తనకు నేటికీ ఉపయోగపడే రాజకీయ పాఠమని ఆయన అన్నారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు మహిళా సాధికారత కోసం ఉద్దేశించినది కాదని రాహుల్ కొట్టిపారేశారు. మనువాదం వర్సెస్ రాజ్యాంగం అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వం రాజ్యాంగం కంటే ‘మనువాదం’పైనే ఎక్కువ నమ్మకం ఉంచిందని ఆయన ఆరోపించారు. హక్కుల కాలరాశే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకువచ్చారన్నారు. ఓబీసీలు, దళితులు, మైనారిటీలను హిందువులని పిలుస్తారు కానీ, వారికి దక్కాల్సిన హక్కులను ఇవ్వడంలో ప్రభుత్వం ‘క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా’ వ్యవహరిస్తోందని విమర్శించారు. 2023లో ఆమోదించిన అసలు బిల్లును పక్కన పెట్టి, ప్రస్తుత ప్రతిపాదన ద్వారా భారతదేశ ఎన్నికల పటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

తన సోదరి ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశం, ఆమె పనితీరుపై రాహుల్ గర్వంగా మాట్లాడారు. “నేను 20 ఏళ్లలో సాధించలేనిది, నా సోదరి ఐదేళ్లలోనే సాధించింది,” అని ఆయన ప్రశంసించారు. అయితే, ప్రియాంక గురించి తాను మాట్లాడుతున్నప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా నవ్వడాన్ని తాను గమనించానని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చివరగా, మహిళా రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప మహిళలకు నిజమైన అధికారం కల్పించడానికి కాదని రాహుల్ గాంధీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *