ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటడం వల్ల భారత కరెన్సీ మార్కెట్‌లో గణనీయమైన అస్థిరత నెలకొంది. ఈ ప్రభావంతో భారత రూపాయి ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే ఈ సంవత్సరం అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొని, 3 శాతానికి పైగా పడిపోయింది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగి, ముఖ్యంగా చమురు ధరలు మరింత ఎగిసిపడే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల మధ్య RBI పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కీలక చర్యలను ప్రారంభించింది. మార్చి చివరి వారానికి రూపాయి విలువ డాలరుకు 95 రూపాయల చారిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగించింది. విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, పెరుగుతున్న చమురు ధరలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి.
ఈ నేపథ్యంలో RBI అత్యవసర చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైనఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియంలకు స్పాట్ మార్కెట్‌లో నేరుగా డాలర్ల కొనుగోళ్లు తగ్గించాలని ఆదేశించింది. ఈ సంస్థలు దేశ చమురు అవసరాలలో కీలక పాత్ర పోషిస్తుండటంతో, వీటి భారీ డాలర్ కొనుగోళ్లు రూపాయిపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. దీన్ని నియంత్రించడానికి, SBI ద్వారా ప్రత్యేక క్రెడిట్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా చమురు కంపెనీలు తమ విదేశీ మారక అవసరాలను నేరుగా మార్కెట్‌లో కాకుండా SBI ద్వారా తీర్చుకునే అవకాశం కల్పించారు. ఇది ఓపెన్ మార్కెట్‌లో డాలర్ డిమాండ్‌ను తగ్గించడంలో సహాయపడింది.
అదనంగా RBI తన విదేశీ మారక నిల్వల నుంచి డాలర్లను విక్రయిస్తూ మార్కెట్‌ను స్థిరపరిచే ప్రయత్నం చేసింది. అనవసర అస్థిరతకు కారణమయ్యే ఆర్బిట్రేజ్ ట్రేడింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బ్యాంకులు నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్ కాంట్రాక్టులు చేయకుండా పరిమితులు విధించింది. ఈ చర్యల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల స్పాట్ మార్కెట్‌లో చమురు కంపెనీల డాలర్ కొనుగోళ్లు తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. గత రెండు వారాల్లో RBI తీసుకున్న చర్యలతో రూపాయి తన కనిష్ట స్థాయి నుంచి దాదాపు 2 శాతం కోలుకుని, ప్రస్తుతం డాలర్‌కు సుమారు 93.20 వద్ద స్థిరపడింది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి