శక్తికి శక్తి.. బాడీ కూల్ కూల్.. సమ్మర్ స్పెషల్ ‘గంజి’ ఇలా చేస్తే అమృతమే..

శక్తికి శక్తి.. బాడీ కూల్ కూల్.. సమ్మర్ స్పెషల్ ‘గంజి’ ఇలా చేస్తే అమృతమే..


శక్తికి శక్తి.. బాడీ కూల్ కూల్.. సమ్మర్ స్పెషల్ ‘గంజి’ ఇలా చేస్తే అమృతమే..

ఎండలు పెరుగుతున్నాయి.. చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆకలి ఉండదు, నోరు చప్పగా మారుతుంది. శరీరం నీరసంగా మారి, జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితులలో తేలికగా జీర్ణమయ్యే, పోషకాలు నిండిన ఆహారం చాలా అవసరం. ఈ అవసరాన్ని తీర్చడానికి ఉప్పుడు బియ్యంతో తయారుచేసే గంజి ఒక అద్భుతమైన సాంప్రదాయక ఆహారం. ఇది పూర్వకాలం నుండి అమ్మమ్మలు, నానమ్మలు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఉపయోగించేవారు.

గంజిని చాలా రకాలుగా తయారుచేసినప్పటికీ, ఉప్పుడు బియ్యంతో చేసే గంజి ప్రత్యేకమైన రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఉప్పుడు బియ్యం గంజి జీర్ణం కావడానికి సులువుగా ఉండటమే కాకుండా, శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. పచ్చి బియ్యంతో చేసే గంజి కంటే ఉప్పుడు బియ్యంతో చేసిన గంజి మరింత రుచిగా, కమ్మగా ఉంటుందని చెబుతారు.

తయారీ విధానం:

గంజి తయారీకి ముందుగా పావు కిలో ఉప్పుడు బియ్యాన్ని (బాయిల్డ్ రైస్) తీసుకోవాలి. వీటిని నేరుగా కాకుండా, స్టవ్ వెలిగించి మట్టి పాత్రలో లేదా ఏదైనా దళసరి పాత్రలో వేసి, మీడియం మంటపై దోరగా వేయించుకోవాలి. మంచి కమ్మటి వాసన వచ్చేవరకు, బియ్యం రంగు మారే వరకు దాదాపు నాలుగు నుండి ఐదు నిమిషాలు వేయించాలి. వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, బియ్యాన్ని పూర్తిగా చల్లార్చాలి. వేడిమీద మిక్సీ పడితే మిక్సీ పాడైపోవచ్చు. చల్లారిన బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసి, పౌడర్‌లా కాకుండా కొద్దిగా బరకగా, బొంబాయి రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో లేదా స్టీల్ డబ్బాలో నిల్వ చేసుకుంటే అవసరమైనప్పుడు తక్షణమే గంజిని తయారుచేసుకోవచ్చు.

గంజి తయారుచేయు విధానం:

ఒక మూడు చెంచాల ఈ గంజి పొడికి, ఒక చిన్న గ్లాసు నీటిని కలిపి ఉడికించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ పొడిని వేసి, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే పచ్చి జీలకర్రను క్రష్ చేసి వేసుకోవాలి. జీలకర్ర కలపడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.. గంజికి కమ్మటి రుచి వస్తుంది. మీడియం మంటపై ఐదు నుంచి ఆరు నిమిషాలు కలుపుతూ ఉడకనివ్వాలి. బియ్యం ఇప్పటికే వేయించి ఉన్నాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. గంజి పలుచగా ఉంటేనే బాగుంటుంది. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడినట్లయితే, మరిన్ని నీటిని కలుపుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు:

సులభంగా జీర్ణం: అనారోగ్యంతో జీర్ణశక్తి మందగించిన వారికి ఇది తేలికగా జీర్ణమవుతుంది.

తక్షణ శక్తి: నీరసంగా ఉన్నవారికి తక్షణ శక్తిని అందించి, ఉపశమనం కలిగిస్తుంది.

నోటికి రుచి: జలుబు, జ్వరంతో నోరు చప్పగా మారినప్పుడు ఇది కమ్మగా ఉండి, రుచిని అందిస్తుంది.

బరువు తగ్గేవారికి: బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఈ గంజి చాలా మంచిది.

మధుమేహం, రక్తపోటు రోగులకు: షుగర్, బీపీ ఉన్నవారు కూడా మధ్యమధ్యలో ఆకలి వేసినప్పుడు ఈ గంజిని తీసుకోవచ్చు.

చిన్న పిల్లలకు: చిన్న పిల్లలకు కూడా ఈ గంజిని తయారుచేసి ఇవ్వవచ్చు.

వేడివేడిగా లేదా గోరువెచ్చగా తాగితే ఈ గంజి మరింత రుచిగా ఉంటుంది. కొందరు చల్లారిన తర్వాత మజ్జిగ కలిపి కూడా తాగుతారు. ఊరగాయతో లేదా పచ్చిమిర్చి, ఉల్లిపాయలతో కలిపి తీసుకుంటే దీని రుచి మరింత పెరుగుతుంది. ఈ సాంప్రదాయ ఉప్పుడు బియ్యం గంజి సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం.. అంతేకాకుండా శరీరానికి చలువ కూడా చేస్తుంది.. అందుకే.. ఈ సీజన్ లో గంజిని చేసుకోని ఆస్వాదించండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *