
తెలుగు సినీ పరిశ్రమలో కొందరు నటులు పోషించిన పాత్రల సంఖ్య కంటే.. వారు ఆ పాత్రలకు ఇచ్చిన జీవం కారణంగానే ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన నటుల్లో సాక్షి రంగారావు ఒకరు. విలన్‌గా భయపెట్టినా, కమెడియన్‌గా నవ్వించినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కంటతడి పెట్టించినా.. ఆయన నటనలో ఒక ప్రత్యేకమైన ముద్ర కనిపించేది. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా తెరపై కనిపించినంతసేపూ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకోవడం ఆయన ప్రత్యేకత. సుమారు 450కుపైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన సాక్షి రంగారావు 1942 సెప్టెంబర్ 15న కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని కొండిపర్రు గ్రామంలో జన్మించారు. ఉద్యోగ జీవితంతో పాటు రంగస్థలంపై నటనను కొనసాగిస్తూ తన వాచికంతో, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదే సమయంలో ఆయన ప్రతిభ ప్రముఖ దర్శకులు బాపు, రచయిత రమణ దృష్టిలో పడింది.
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సాక్షి రంగారావు సినీ ప్రయాణానికి కీలక మలుపు బాపు దర్శకత్వంలో తెరకెక్కిన సాక్షి సినిమా. తన 25వ ఏట ఈ చిత్రంలో కరణం పాత్రను పోషించారు. ఆ సినిమా తర్వాత ఆయన అసలు ఇంటిపేరు కంటే ‘సాక్షి’ పేరే ప్రేక్షకులకు బలంగా గుర్తుండిపోయింది. అలా రంగావజ్ఝల రంగారావు కాస్తా సాక్షి రంగారావుగా మారిపోయారు. ఆయనలోని నటనా ప్రతిభను గుర్తించిన పలువురు దర్శకులు వరుస అవకాశాలు ఇచ్చారు. భానుమతి వంటి సీనియర్ కళాకారులతో కలిసి నటించిన ఆయన, మట్టిలో మాణిక్యం వంటి చిత్రాల్లో కామెడీ విలనిజంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భానుమతి ఆయనను ఆప్యాయంగా పసుపుకొమ్ము అని పిలిచేవారని సినీ వర్గాల్లో చెప్పుకునేవారు. సాక్షి రంగారావు కామెడీ చేసినప్పుడు ఆయన డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన రెండు రెళ్లు ఆరు చిత్రంలోని ఆయన పాత్ర ఇందుకు మంచి ఉదాహరణ.
బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే
ఆ పాత్రను వేగంగా, ప్రత్యేకమైన శైలిలో మాట్లాడేలా జంధ్యాల తీర్చిదిద్దారు. దర్శకుడు చెప్పిన సూచనలను తనదైన నటనా శైలిలోకి మార్చుకుని తెరపై పండించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. డైలాగ్‌ను కేవలం పలకడం కాకుండా.. దానికి తన బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ జోడించడం సాక్షి రంగారావు ప్రత్యేకత. సాక్షి రంగారావులోని నటుడిని సంపూర్ణంగా ఉపయోగించుకున్న దర్శకుల్లో కె. విశ్వనాథ్ పేరు ముందుగా చెప్పుకోవాలి. కామెడీ, సెంటిమెంట్, విలనిజం.. ఇలా ఆయనలోని విభిన్న కోణాలను విశ్వనాథ్ తన సినిమాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. స్వర్ణ కమలం లో భక్తిలో మునిగిపోయిన భార్యతో ఇబ్బంది పడే భర్తగా ఆయన చేసిన నటన ప్రేక్షకులను నవ్వించింది. భార్య పాత్రలో శ్రీలక్ష్మితో కలిసి ఆయన చెప్పే సంభాషణలు ఆ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే
అలాగే సాగర సంగమంలోనూ సాక్షి రంగారావు తనదైన మాడ్యులేషన్‌తో గుర్తుండిపోయే సన్నివేశాలను పండించారు. సాధారణంగా కనిపించే పాత్రకు కూడా తన ప్రత్యేకమైన పలుకుబడి, హావభావాలు జోడించి దాన్ని గుర్తుండిపోయేలా చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆయనకు ఇచ్చిన స్క్రీన్ టైమ్ పరిమితమే అయినప్పటికీ.. పాత్రను ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచేలా చేయడం ఆయన నటనా ప్రతిభకు నిదర్శనం. ఇక బాపు దర్శకత్వంలో వచ్చిన బంగారు పిచ్చుకలో సాక్షి రంగారావు పూర్తిగా భిన్నమైన కోణంలో కనిపించారు. బయటకు ఎంతో వినయంగా కనిపిస్తూ, లోపల మాత్రం కుట్రలు పన్నే పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో తన అసలు స్వరూపాన్ని బయటపెట్టే సన్నివేశాల్లో ఆయన చూపించిన నటన సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. కె. విశ్వనాథ్‌కు సాక్షి రంగారావుపై ఉన్న నమ్మకం ఎంతటిదో ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. దాదాపు ప్రతి సినిమాలోనూ ఆయనకు ఏదో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉండేది. ‘సిరివెన్నెల’, ‘సూత్రధారులు’ వంటి చిత్రాల్లోనూ ఆయన తనదైన నటనా శైలితో ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు వంశీ సినిమాలతోనూ సాక్షి రంగారావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఏప్రిల్ 1 విడుదలలో కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఆయన మంచుపల్లకిలో మాత్రం భిన్నమైన సెంటిమెంట్ పాత్రలో కనిపించారు. అలాగే సితారలో ఆయన పోషించిన పాత్రను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు.
సాక్షి రంగారావు నటనా సిద్ధాంతం చాలా సరళంగా ఉండేదని ఆయనను దగ్గరగా చూసినవారు చెబుతారు. పాత్ర నిడివి ఎంత అనేది కాకుండా.. తెరపై కనిపించినంతసేపూ ప్రేక్షకుడి దృష్టి తనపై ఉండేలా నటించడమే అసలు సవాలు అని ఆయన భావించేవారు. అందుకే కొన్ని సినిమాల్లో కొద్ది సన్నివేశాల్లో మాత్రమే కనిపించినప్పటికీ.. ప్రేక్షకుల జ్ఞాపకాల్లో మాత్రం ఆయన పాత్రలు ఎక్కువకాలం నిలిచిపోయాయి. విలనిజంలో భయపెట్టగలిగారు. కామెడీలో కడుపుబ్బా నవ్వించగలిగారు. సెంటిమెంట్ సన్నివేశాల్లో భావోద్వేగానికి గురిచేయగలిగారు. ఇలా ఒకే నటుడిలో ఇన్ని భిన్నమైన కోణాలు కనిపించడం సాక్షి రంగారావు ప్రత్యేకత. నటుడిగా జీవితాంతం కొనసాగాలని, చివరి వరకు కళతోనే ఉండాలని కోరుకునే వారికి సాక్షి రంగారావు జీవితం ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది. ‘కన్యాశుల్కం’ నాటకం రిహార్సల్స్‌లో పాల్గొంటున్న సమయంలో 2005 మే 5న వేదికపైనే ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే ఏడాది జూన్ 27న కన్నుమూశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.