Headlines

22ఏ భూముల చిక్కులకు పరిష్కారం.. ULC కాలనీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!


తెలంగాణ ప్రభుత్వం అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (ULC) భూముల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 15 వేల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 15 వేలకు పైగా కుటుంబాలకు తమ భూములపై పూర్తి హక్కులు లభించనున్నాయి. ముఖ్యంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్‌ 22ఏ సమస్యలను పరిష్కరిస్తూ, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వేగంగా క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఇది లక్షలాది మందికి ఆస్తి హక్కులను సురక్షితం చేస్తుంది.

తెలంగాణలో అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (ULC) భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ULC భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మెమో నంబర్‌ 48062ను జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

ULC చట్టం పరిధిలోకి వచ్చిన భూముల్లో ఏర్పడిన కాలనీలు, నివాసాలకు పూర్తి స్థాయి హక్కులు లేకపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్‌ 22ఏ కింద నిషేధిత భూముల జాబితాలో కొన్ని ULC భూములు ఉండటంతో వాటి రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలకు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న భూములను గుర్తించి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

భూ సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ULC భూములకు సంబంధించిన పెండింగ్‌ దరఖాస్తులను రాష్ట్రవ్యాప్తంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. హైదరాబాద్‌ పరిధితో పాటు అన్ని జిల్లాల్లోని దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు వెల్లడించారు.

గతంలో ULC చట్టం కింద ప్రభుత్వానికి స్వాధీనం అయిన భూముల్లో కొంత భాగాన్ని పేదలకు పంపిణీ చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో కాలనీలు ఏర్పడ్డాయి. కొన్ని భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ ఆక్రమణలకు గురయ్యాయి. ఈ క్రమంలో సంబంధిత సర్వే నంబర్లు సెక్షన్‌ 22ఏ జాబితాలో చేరడంతో సమస్యలు మరింత క్లిష్టంగా మారాయి.

2002 నుంచి 2016 మధ్య ఈ భూముల క్రమబద్ధీకరణ కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 15 వేల దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్లు రెవెన్యూ శాఖ పేర్కొంది. 2016లో పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి గత ప్రభుత్వం జీవోలు జారీ చేసినప్పటికీ అవి పూర్తిస్థాయిలో అమలు కాలేదని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం పాక్షికంగా క్రమబద్ధీకరించిన కాలనీలతో పాటు ఇప్పటివరకు క్రమబద్ధీకరణకు నోచుకోని అర్హమైన కాలనీలను గుర్తించి ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. క్రమబద్ధీకరణ పూర్తయితే అర్హులైన కుటుంబాలకు వారి ఆస్తులపై చట్టబద్ధమైన హక్కులు లభించడంతో పాటు, నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ఆస్తి లావాదేవీలకు మార్గం సుగమం కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *